అంత్యక్రియల కోసం..

– ఉప్పొంగుతున్న వాగులో పాడే మోత
నవతెలంగాణ-చేర్యాల
జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిద్దిపేట జిల్లాలో మరణించిన వ్యక్తి అంత్యక్రియల కోసం ఉప్పొంగుతున్న వాగులో పాడే మోస్తూ గ్రామస్తులు, బంధువులు ఈదుకుంటూ అవస్థలు పడిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే… చేర్యాల మండలం వేచరేణి గ్రామంలో మంగళవారం సాయంత్రం గ్రామానికి చెందిన బసవరాజు బాలయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తులు, బంధువులందరూ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగు ఉప్పొంగుతోంది. శ్మశానవాటిక వాగు అవతలి వైపు ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వాగు దాటి అంత్యక్రియలు నిర్వహించారు. కాగా, చేర్యాల వేచరేణి గ్రామాల మధ్య వాగు ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది కలగకుండా వంతెన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.1.96 కోట్లు కేటాయించి టెండర్‌ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ కాంట్రాక్టర్‌ జాప్యం చేస్తున్నట్టు గ్రామ సర్పంచ్‌ ఏనుగుల దుర్గయ్య అసహనం వ్యక్తం చేశారు. ఈ కాంట్రాక్ట్‌ అక్టోబర్‌తో ముగుస్తున్నందున ఇప్పటికైనా పనులు చేపట్టాలని కోరారు.