అభివృద్ధిని మరచి దశాబ్ది ఉత్సవాలు చేయడమేంటి ?

పీసీసీ సభ్యులు మహమ్మద్‌ అలీ ఖాన్‌ బాబర్‌
నవతెలంగాణ-షాద్‌ నగర్‌
అభివృద్ధిని మరచి దశాబ్ది ఉత్సవాలు చేయడమేంటనీ రూ.33.50 లక్షల ప్రజాధనం మున్సిపాలిటీ నిధులతో దశాబ్ది ఉత్సవాలు జరపడం అవసరమా అని పీసీసీ సభ్యులు మహమ్మద్‌ అలీఖాన్‌ బాబర్‌ విమర్శించారు. సోమవారం షాద్‌నగర్‌ పట్టణంలోని మున్సిపల్‌ గాంధీనగర్‌ కాలనీలో సమస్యకు నిలయమైన డ్రయినేజీ కాలువ వద్ద విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 9న వర్షానికి గాంధీనగర్‌ కాలనీలో పాత జాతీయ రహదారి పక్కన ఎంతోమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. దీంతో పాటు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయని తెలిపారు. ఈ సందర్భంగా మహమ్మద్‌ అలీ ఖాన్‌ బాబర్‌ మాట్లాడుతూ మున్సిపల్‌ చైర్మన్‌ సొంతవార్డులోనే ఈ దుస్థితి ఏర్పడితే మిగతా వార్డుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఇన్ని రోజుల నుండి ప్రజల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన ఈ రహదారి డ్రైనేజీ సమస్యపై మున్సిపల్‌ కమిషనర్‌, చైర్మన్‌ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దశాబ్ది ఉత్సవాల పేరుతో షాద్‌నగర్‌ మున్సిపాలిటీలో 33.50 లక్షల రూపాయలు ఖర్చుపెట్టి గొప్పగా నిధులు తగలేస్తున్నారని అన్నారు. అభివృద్ధి పనులు గాలికి వదిలేసి పైపై మెరుగులతో మున్సిపాలిటీ గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. తమ వెంట వస్తే పట్టణంలో ఎంత అభివృద్ధి జరిగిందో? అధికారులకు కళ్లకు కట్టినట్టు చూపిస్తామని సవాల్‌ విసిరారు. దశాబ్ది ఉత్సవాల పేరిట మున్సిపల్‌ అధికారులు ప్రజాప్రతినిధులు లాభపడ్డారని ప్రజలకు ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. ప్రజాధనాన్ని ఎంతో నిరుపయోగం చేస్తున్నారని అన్నారు. దశాబ్ది ఉత్సవాల ముసుగులో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారం చేసుకుంటుందని ఎన్నికలకు ముందు తప్పుడు దారిలో ప్రభుత్వం అభివృద్ధి చేయకపోయినా వాటి గురించి గొప్పలు చెప్పుకుంటుందని విమర్శించారు. పట్టణంలో ఎన్నో సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు తమ వద్దకు వస్తే సమస్యలు ఎక్కడ ఉన్నాయో చూపిస్తామని సూచించారు.ఈ కార్యక్రమంలో పి రఘు, అలీమ్‌ షకీబ్‌, గంగమోని సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.