జాగో తెలంగాణ ఏర్పాటు

– బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించాలి : చంద్రకుమార్‌, ఆకునూరి మురళి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, జస్టిస్‌ (విశ్రాంత) చంద్రకుమార్‌ ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సుమారు 46 ప్రజాసంఘాల సంఘటనతో ‘జాగో తెలంగాణ’ అనే పేరిట ప్రజాసంఘాల వేదిక ఏర్పడింది. రాష్ట్రంలో పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్న బీఆర్‌ఎస్‌ను, విద్వేష, అవినీతి రాజకీయాలు చేస్తున్న బీజేపీని ఓడించే లక్ష్యంతో జాగో తెలంగాణ ఏర్పడిందని జస్టిస్‌ చంద్రకుమార్‌, ఆకునూరి మురళి తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ప్రొఫెసర్లు, అడ్వకేట్లు, క్రియాశీల కార్యకర్తలు, పౌరసంఘాల నేతలు, ముస్లిం సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నాలుగు తీర్మానాలు చేశారు.
తెలంగాణలో పోరాడే వ్యక్తులు, పౌర సంఘాలు, ఒక జాగో తెలంగాణ నెట్‌వర్క్‌గా ఏర్పడి, వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల పక్షాన, ప్రజల ప్రయోజనమే కేంద్రంగా పనిచేయాలని నిర్ణయించారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చెందిన ప్రజల పరస్పర విశ్వాసాలను గౌరవిస్తూ, వారి మధ్య సోదర భావం, ఐక్యతను పెంపొందించడం కోసం కషి చేయాలని నిర్ణయించారు. విద్వేష, మతతత్వ శక్తులను ప్రతిఘటించాలని, ప్రజల్లో విభజన, విద్వేషాలను రెచ్చగొట్టే శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించారు.
తెలంగాణలో ప్రభుత్వ అవినీతిని, ఆర్థిక దోపిడిని, రాష్ట్ర వనరులు, సంపదను కొల్లగొడుతున్న తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
త్వరలో ‘తెలంగాణ ప్రజల ప్రణాళిక’ (పీపుల్స్‌ మేనిఫెస్టో)ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.