ప్రజలను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే టీ. రామ్మోహన్‌ రెడ్డి

– పుడుగుర్తిలో కాంగ్రెస్‌ జెండా ఆవిష్కరణ
నవతెలంగాణ-పూడూర్‌
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని డీసీసీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పూడూర్‌ మండల పరిధిలోని పుడుగుర్తి గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి వేల కోట్లు సంపాధించుకున్నారని విమర్శించారు. ఉత్సవాల పేరుతో 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని అన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే ఇప్పటికి కనిపిస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో గిరిజనుల అభివృద్ధి కోసం ఇందిరా జలప్రభ లాంటి సంక్షేమ పథకాలను తీసుకొని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమాన్ని కోరుకోలేదన్నారు. ఇష్టానుసారంగా సంక్షేమ పథకాలు పెట్టి కోట్ల రూపాయలు సంపాధించుకున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిక మెజార్టీతో గెలుస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.
పుడుగుర్తి సొసైటీ డైరెక్టర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిక
పుడుగుర్తి సొసైటీ డైరెక్టర్‌ డిసిసి అధ్యక్షులు రామ్మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో డైరెక్టర్‌ వెంకటయ్య బిఆర్‌ఎస్‌ నుంచి ఎక్కువ మంది కార్యకర్తలతో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి, పూడూర్‌ సొసైటీ చైర్మన్‌ పి సతీష్‌ రెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు సురేందర్‌ ముదిరాజ్‌, జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు పెంటయ్య, కండ్లపల్లి శ్రీనివాస్‌, అజీమ్‌ పటేల్‌, పుడుగుర్తి గ్రామ కాంగ్రెస్‌ నాయకులు రవి శ్రీకాంత్‌ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.