రాజ్యసభలో నాలుగు బిల్లులు ఆమోదం

Four bills passed in Rajya Sabha

– రాజ్యసభలో ప్రతిపక్షాల వాకౌట్‌
– టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
1942 క్విట్‌ ఇండియా ఉద్యమాన్ని (క్విట్‌ ఇండియా దివస్‌) స్మరించుకుంటూ ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు బుధవారం పార్లమెంట్‌ ఆవరణంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళుర్పించారు. అలాగే పార్లమెంట్‌ ఉభయ సభల్లో స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తూ ఎంపీలు మౌనం పాటించారు. రాజ్యసభ ప్రారంభం కాగానే మణిపూర్‌పై చర్చకు ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. దీనికి వ్యతిరేకంగా అధికార పక్ష ఎంపీలు నినాదాలు ఇచ్చారు. దీంతో చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు వైపుల సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. కానీ నినాదాలు హౌరెత్తించారు. దీంతో జగదీప్‌ ధన్కర్‌ మాట్లాడుతూ తనకు ద్ణుఖంగా ఉందని అన్నారు. వెంటనే 17 నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ మైన సభలో రాజ్యాంగ (ఎస్‌సీ) ఆర్డర్‌ సవరణ బిల్లును చర్చకు పెట్టారు. అయితే ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు హౌరెత్తించారు. ప్రతిపక్ష నేతకు మాట్లా డేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 2:45 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో మల్లికార్జున్‌ ఖర్గే మాట్లాడుతూ ప్రధాని సభకి రావాలని డిమాండ్‌ చేశారు. మణిపూర్‌పై వివరణాత్మక చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ మాట్లాడుతూ రూల్‌ 267 కింద చర్చ జరగాలని, ప్రధాన మంత్రి సభకు రావాలని కోరుతున్నామని, ప్రభుత్వం కేవలం హౌం మంత్రి ఉంటారని చెబుతుందని, మీరే దీనికి ఒక మార్గం వెతకాలని కోరారు.. వెంటనే ఖర్గే మాట్లాడుతూ తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించటం లేదని, కనుక తాము నిరసనగా వాకౌట్‌ చేస్తున్నామని తెలి పారు. అనంతరం డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లు, రాజ్యాంగ (ఎస్‌సీ) ఆర్డర్‌ సవరణ బిల్లు, అను సంధన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లు, ఫార్మసీ (సవరణ) బిల్లు, తీర ఆక్వాకల్చర్‌ అథారిటీ (సవరణ) బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదించు కున్నారు. టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఓబ్రెయిన్‌పై సస్పెన్షన్‌ ఎత్తి వేశారు.
మణిపూర్‌లో శాంతి స్థాపన కోసం లోక్‌సభలో కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్షాల ప్రధాని మోడీ సమక్షంలో తీర్మానం పెట్టాలని డిమాండ్‌ చేశాయి. వెంటనే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జోక్యం చేసుకొని ప్రధాని మోడీ నేడు (గురువారం) సభలో మాట్లాడతారని అన్నారు. అప్పుడే తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు కోరాయి. అయితే స్పీకర్‌ ఓం బిర్లా తీర్మానం పెట్టడంపై సమ్మతించే వారు చేతులెత్తండ ని పేర్కొన్నారు. దీంతో అధికార సభ్యులంతా చేతులెత్తి తీర్మానానికి మద్దతు తెలిపారు. లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్షాలు ఆందోళన చేప ట్టాయి. ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాల హౌరెత్తించారు. ప్రధాని మోడీ సభకు రావాలని, సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో సభను స్పీకర్‌ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభ మైన సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగింది. రాహుల్‌ గాంధీ, ఎ.రేవంత్‌ రెడ్డి (కాంగ్రెస్‌), ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ కార్ఫరెన్స్‌), కనిమొళి (డీఎంకే), ఈటి మహ్మద్‌ బషీర్‌ (ఐయుఎంఎల్‌), మిథున్‌ రెడ్డి (వైసీపీ), నామా నాగేశ్వరరావు (బీఆర్‌ఎస్‌), కె.సుబ్బ రాయన్‌ (సీపీఐ), రాజీవ్‌ రంజన్‌ సింగ్‌ (జేడీయూ), కకోలి ఘోష్‌ (టీఎంసీ), హర్‌సిమ్రత్‌ కౌర్‌ (ఎస్‌ఏడీ), కేంద్ర మంత్రులు అమిత్‌ షా, స్మృతి ఇరానీ, రామ్‌ క్రిపాల్‌ యాదవ్‌, హీనా గావిట్‌ (బీజేపీ), అనుప్రియ పటిల్‌ (అప్నాదళ్‌) తదితరులు మాట్లాడారు. కేంద్ర హౌం మంత్రి అమిత్‌ షా 2.03 గంటల పాటు మాట్లాడారు.