23 నుంచి నీట్‌పై ఉచిత అవగాహన తరగతులు

నవ తెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్‌ రాతపరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఎలా విజయం సాధించాలనే అంశంపై ఈనెల 23 నుంచి 25 వరకు మూడురోజులపాటు ఉచిత అవగాహన తరగతులను నిర్వహిస్తున్నట్టు మెటామైండ్‌ అకాడమి డైరెక్టర్‌ మనోకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేకంగా బాలబాలికల కోసం ఉచిత హాస్టల్‌ వసతితో మొదటి 60 మందికి నిర్వహించే ఈ తరగతుల్లో నీట్‌ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, మెంటార్‌షిప్‌, టెస్ట్‌ సిరీస్‌, తదితరు నూతన సన్నద్ధత విధానాన్ని వివరిస్తామని పేర్కొన్నారు. నీట్‌ ర్యాంకర్లు, సీనియర్‌ అధ్యాపకులు, విషయ నిపుణులు పాల్గొని సూచనలు, సలహాలిస్తారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇంటర్‌ బైపీసీ పూర్తి చేసిన బాలబాలికలు ఈ తరగతులను వినియోగించుకోవాలని సూచించారు.