దొరల పాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించండి..

– టిడిపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్
నవతెలంగాణ – మీర్ పేట్
దొరల పాలన నుండి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు టీడీపీతో ప్రజలు కలిసి రావాలని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రజలకు, యువతకు పిలుపునిచ్చారు. ఆదివారం మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 36వ డివిజన్ కార్పొరేటర్ మహేశ్వరం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి ఎడ్ల మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో మంద మల్లమ్మ చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి జిల్లెలగూడా, మీర్ పేట్ మీదుగా బాలాపూర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీతో బాలాపూర్ చౌరస్తాలో నిర్మాణం చేసిన మహేశ్వరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి పార్టీ అణగారిన వర్గాలకు, బహుజనులకు, అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. వార్డు స్థాయిలో టిడిపినీ బలోపేతం చేయడమే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నామని జ్ఞానేశ్వర్ తెలిపారు. ఆగస్టు 16వ తేదీన తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టబోతున్నామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏపార్టీతో పొత్తులు లేవని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పొత్తుల విషయం చేసుకుంటారని 119 నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులు బరిలో దిగబోతున్నారని స్పష్టం చేశారు. టిడిపి హయాంలో చేసిన అభివృద్ధి ఇప్పటికీ కనపడుతుందని అన్నారు. బహుజన బడుగు బలహీన వర్గాలకు అధికారమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగుతున్నామని తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించబోతున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిభిక్షపతి ముదిరాజ్, ప్రకాష్ ముదిరాజ్, రవీంద్ర చారి, వాసు సాగర్, ఆసీఫ్, శ్రీకాంత్ పెద్ద ఎత్తున టిడిపి సైనికులు, మహిళలు పాల్గొన్నారు.