స్వేచ్ఛ

మహిళా దినోత్సవం
స్త్రీ సాధికారత అంటూ
ఈ ఒక్కరోజు సంబరాలు మాకొద్దు.
మీ మేల్‌ ఈగోలు మగ పెత్తనాలు
పురుషాహంకారాలు అన్నీ పక్కన పెట్టి
ఆమెను ఆమెలా బతకనిస్తే చాలు.
ఆమె కలలు, కన్నీళ్లకు
ఇంత విలువిస్తే చాలు.
ఆమె ఆశలు, ఆశయాలను నిలబెడితే చాలు.
అనుమానాలు, ఆక్షేపణలు వదలి ఇంత అభిమానం
కురిపిస్తే చాలు.
బతుకంతా తోడోస్తున్నందుకు
ఆమె ఒక మనిషని గుర్తిస్తే చాలు.
ఆడది తక్కువని మగవాడు ఎక్కువని కాక
ఇద్దరూ ఒక్కటేనని ఒప్పుకుంటే చాలు.
స్వేచ్ఛగా నింగిలో ఎగరాలనుకునే పక్షి
‘ఆమె’ అయినప్పుడు ఆంక్షల గుండ్లతో వేటాడే
వేటగాడు ‘అతడు’ కాకూడదు.
అతను ఆమె చెరిసగం అనుకుంటే
ప్రతి రోజు ఉమన్స్‌ డే నే.
– శైలజ బండారి