స్నేహాన్ని నిర్వచించడం చాలా కష్టం. మాటలకు అందని బంధం. మన గురించి మనకు గొప్పగా అనిపించేలా చేసే వారు స్నేహితులనడంలో సందేహం లేదు. లైఫ్‌లోని కష్టమైన పరిస్థితులు కూడా మనకు తేలిగ్గా కనపడేలా చేస్తారు. కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లో కూడా స్నేహితులు తోడుంటారు. ప్రపంచం మొత్తం ఒంటరిని చేసినా స్నేహితులు మాత్రం పక్కనే ఉంటారు. అలాంటి స్నేహం గురించి…
– ప్రతి ఒక్కరూ లైఫ్‌లో ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొం టారు. అటువంటి సమయంలో మనసులోని బాధనంతా బయటపెట్టడానికి ఒక స్నేహం కావాలి. స్నేహితుల దగ్గరే మనసు విప్పి మాట్లాడగలుగుతారు. మనసును తేలిక పరుస్తారు. చెప్పేదంతా ఓర్పుతో వింటారు. కష్టమైన దశను దాటడానికి సలహాలు ఇస్తారు. కష్ట సమయంలో అవసరమైన స్నేహ హస్తాన్ని అందిస్తారు. పరిస్థితి ఎలా ఉన్నా పాజిటివ్ ఎనర్జీని ఇవ్వడానికి స్నేహితులు ఎప్పుడూ ముందుంటారు.
– మన కోసం టైమ్ కేటాయించడానికి ఫ్రెండ్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఫ్రెండ్స్ లేకపోతే ఇంట్లోనే ఒంటరిగా కూర్చుని టీవీ చూడడం గానీ వీడియో గేమ్స్ ఆడటం గాని చేస్తుంటారు. ఫ్రెండ్స్ ఉంటే మనసు యాక్టివ్‌గా ఉంటుంది. దీని వల్ల హెల్తీ లైఫ్‌స్టైల్‌ను మెయింటెయిన్ చేయడం సాధ్యమవుతుంది.
– ఫ్రెండ్స్ సీక్రెట్ బ్యాంక్స్ లాంటివారు. ప్రతి ఒక్కరికీ లైఫ్‌లో కొన్ని రహస్యాలు ఉంటాయి. ఫ్రెండ్స్‌తో సీక్రెట్ షేర్ చేయడం ఎంతో సురక్షితం. మీ ఫస్ట్ క్రష్‌తో మొదలుపెడితే ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్ ఇలా ఎన్నో విషయాలు షేర్ చేసుకోవచ్చు.
– కొన్ని సార్లు మన సామర్థ్యం పట్ల, మనం తీసుకునే నిర్ణయాల పట్ల మనకే నమ్మకం కలగదు. అటువంటి సమయంలో ఫ్రెండ్స్ మనకు కావాల్సినంత నమ్మకాన్ని ఇస్తారు. ముందడుగు వేసే ధైర్యం ఇస్తారు. ఎంత కష్టమైన టాస్కైనా సరే అఛీవ్ చేసే కాన్ఫిడెన్స్ వారి వల్లే సాధ్యమవుతుంది. కలలు నిజమయ్యేందుకు, గోల్స్‌ను చేరుకోడానికి సహాయం చేస్తారు. లైఫ్‌లో ముందడుగు వేయడానికి ఇది ఎంతో అవసరం.
– ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు మనం మనలా ఉండవచ్చు. మేకప్ అవసరం లేదు, స్టైల్‌గా రెడీ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఇవన్నీ ఫ్రెండ్స్ పెద్దగా పట్టించుకోరు. మనల్ని మనలాగానే ఇష్టపడతారు. వారు మనలోని అన్ని కోణాలను చూసేసారు. మన మనసులో ఏముందో కూడా ఇట్టే కనిపెట్టేస్తారు. వీక్‌నెస్, లోపాలు.. ఇలా ప్రతీది వారికి తెలుసు. స్నేహితుల ముందు నటించనక్కర్లేదు. కాబట్టి ఫ్రెండ్స్‌తో ఉంటే కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టే.