
– ప్రకృతి ప్రేమికులు, ఫ్రూటేరియన్
– షేక్ మహమూద్ పాషా
నవతెలంగాణ – ఆళ్ళపల్లి :
ఫలములను మానవుడు తన దైనందిన జీవితంలో నిజమైన ఆహారంగా భావించి ప్రతిరోజూ స్వీకరిస్తే గనుక తన నిజమైన ఆరోగ్య స్థితిని ఆ మనిషి స్వయంగా గ్రహించగలడని ప్రకృతి ప్రేమికులు, విజనరీ, ఫ్రూటేరియన్, మండలంలోని జాకారం గ్రామం ఎంపీపీఎస్ హెచ్.ఎం షేక్ మహమూద్ పాషా అంటున్నారు. గురువారం ఆయన నవతెలంగాణ ప్రతినిధితో తన అభిప్రాయాలు తన మాటల్లోనే.. సాధారణంగా అందరూ ఆరోగ్యానికి సంబంధించిన సరియైన అవగాహనను కలిగి ఉండకపోవడమే ప్రస్తుతం మానవులు అనుభవిస్తున్న సమస్త రోగాలకు ప్రధాన కారణం. ఆహారం కాని దానిని మనిషి ఆహారంగా స్వీకరిస్తే ఆరోగ్యం ఎలా వస్తుంది? ఆరోగ్యం కావాలంటే శరీరానికి కావల్సిన సరైన ఆహారం తీసుకోవాలి. వాస్తవానికి మానవుడు శరీరానికి కావాల్సింది తినకుండా, మనసుకు నచ్చింది తింటున్నాడు. వాటి వల్లే మనిషికి రోగాలు వస్తున్నాయి అంటున్నారీ ప్రకృతి ప్రేమికులు. పరిష్కారం పాషా మాటల్లో.. అనాదిగా మానవుడు ప్రకృతి ఇచ్చిన ఫలములనే ఆహారంగా స్వీకరించేవాడు. రాను రాను వాతావరణం, ప్రకృతి మార్పులకు అనుగుణంగా మానవుడు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సీజన్లో మాత్రమే పండ్లు దొరకడం, సీజన్ మారినప్పుడు వేరే ప్రాంతానికి వలస వెళ్లడం, పండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండకపోవడం, తదితర కారణాలతో ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహారాన్ని ఎలా తయారు చేయాలనే ఆలోచనలో పడ్డాడు. దానికి పరిష్కారంగానే వ్యవసాయాన్ని కనిపెట్టాడు. ఇలా మానవుడు తన ఆహార పంథాను పరిస్థితులకు అనుగుణంగా మార్చుకున్నాడు. ప్రస్తుతం పూర్తిగా తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకునే ఆహారాన్ని తయారు చేసుకుని ఇటు మానవాళికి అటు ప్రకృతికి అత్యంత వినాశకారిగా మానవుడు మారిపోయాడు. ఎందరో మహానుభావులు(శాస్త్రవేత్తలు) తమ జీవితాలను ఫణంగా పెట్టి మానవుడు శరీరానికి శ్రేష్టమైన, ఆరోగ్యకరమైన ఆహారం ప్రకృతి సహజ సిద్ధంగా లభించే రుతు క్రమంగా లభించే ఫలాలని గ్రహించారు. సగటు మనిషి ఫలాలను తినడం లేదనే విషయం గ్రహించి ప్రస్తుత సమాజంలో చాలామంది ప్రకృతిని అర్థం చేసుకున్న మనుషులు(వైద్యులతో సహా) తమ ఆహారంలో ఏదో ఒక పూట పండ్లను తినడం, ఇతరులకు తినమని చెప్పడం మనం చూస్తున్నాం. ఇలా జీవితంలో అత్యద్భుతమైన మార్పులను వాళ్లు చవిచూసి ఆరోగ్యంగా జీవిస్తున్నారు. అలాగే పండ్లు తినడం అలవాటు చేసుకునే వారు సైతం ఉన్నంతలో ఒక్క పూట కాకుండా రోజులో ఎన్ని పూటలైనా కేవలం ఫలములను మాత్రమే స్వీకరించి ఒక 11, 21, 30, 40 రోజుల పాటు తినడం చేయగలిగితే వారి శరీరం తొలుత తనను తాను సమన్వయం (హీల్) చేసుకుని తదుపరి రుజువీనేషన్ అనే పద్దతి మొదలై శరీరంలోని ప్రతి కణం తన నిజమైన శక్తి సామర్ధ్యాలు మొత్తం బయటికి వచ్చి శరీరం యవ్వనంతో ఆరోగ్యంతో శక్తివంతంగా తయారవుతుంది. ప్రస్తుతం మానవుడు ఎలాంటి అనారోగ్య స్థితిలో ఉన్న ఈ పండ్లను ఆహారంగా తినే అలవాటు చేసుకుంటే గనుక 11 రోజుల్లోనే అతని ఆరోగ్య స్థితి మెరుగవుతుంది. ఒక నెల రోజులు పూర్తిగా పండ్లను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే గనక ఆ మనిషి శరీరం అద్భుతమైన స్వేచ్ఛను, అనుభూతుని పొందుతుంది. వండిన ఆహారమే మానవాళి వినాశనానికి మార్గం. ఎంత తక్కువ వండిన ఆహారాన్ని మానవుడు స్వీకరిస్తే అంత ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంచుకుంటాడు. సాధారణంగా ఫలాలను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తే మానవాళి ఆయు ప్రమాణం 160 సంవత్సరములు. కానీ, ప్రస్తుత కాలంలో మానవుడు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు.. ఇలా ఆహారాన్ని శరీరానికి ఎంత మొత్తంలో ఏమిస్తే ఆరోగ్యంగా ఉంటుందో! అని లెక్కలు వేసుకొని నానా అగచాట్లు పడుతూ అనారోగ్యాన్ని చక్కగా కొని తెచ్చుకుంటున్నాడు. శరీరానికి సరియైన ఆహారాన్ని ఇస్తే శరీరమే తనకు ఏం కావాలో అలా ఆహారాన్ని మార్చుకుంటుంది. బయట నుంచి మనిషి ప్రత్యేకంగా శరీరానికి ఇవ్వవలసిన అవసరం లేదు. నేటి సమాజంలో ఉన్న ఆహారం ఒక వ్యాపార ఉత్పత్తి కాబట్టి సరైన ఆహారాన్ని మీ జీవితంలోకి ఎవరూ రానివ్వరు. నిజంగా ఆరోగ్యం కావాలనుకునే ప్రతి మనిషి ఫలములను ఒకసారి 11 రోజులు ఆహారంగా స్వీకరించి చూడండి. మార్పు మీకే అర్థమవుతుంది. ‘జ్ఞానం కంటే అనుభవం గొప్పది’ ఒక విషయాన్ని చేసి అర్థం చేసుకుని అనుభవించినప్పుడు మాత్రమే అది నీ సొంతమవుతుందని అంటున్నారీ ప్రకృతి ప్రేమికులు షేక్ మహమూద్ పాషా.
9949387861