నవతెలంగాణ తిరుమలగిరి: ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికలలో తుంగతుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాదరి కిషోర్ కుమార్ కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరుతూ ఆదివారం మున్సిపాలిటీ కేంద్రంలోని పలు వార్డులలో గాదరి కిషోర్ కుమార్ సతీమణి గాదరి కమల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికి తిరుగుతూ బొట్టు పెట్టి ఈవీఎంలను చూపిస్తూ కారు గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. గడచిన పది సంవత్సరాల నుంచి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచారని, చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని కోరారు. కిషోర్ గెలుపుతోనే తుంగతుర్తి మరింత అభివృద్ధి జరుగుతుందని, ప్రజలందరూ ఆశీర్వదించి కారు గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమ్మినేని స్రవంతి సతీష్ కుమార్, కౌన్సిలర్లు సంకేపల్లి జ్యోతి నరోత్తం రెడ్డి పత్తేపురం సరిత నాగార్జున, నాయకులు లింగయ్య రవీందర్, అడ్డబొట్టు చారి, ఆనగందుల మల్లేష్,మరియు మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.