ఎమ్మెల్యేల గలాటా..! పొదెం వర్సెస్‌ రేగా

– రసాభసగా బీసీ రుణాల చెక్కుల పంపిణీ
– రాష్ట్రవ్యాప్తంగా ఇలానే ఉందా అంటూ ఎమ్మెల్యే పొదెం ఆగ్రహం
– రేగా దగ్గర మైక్‌ లాక్కున్న పొదెం
– ఆందోళనతో దద్దరిల్లిన భద్రగిరి
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు మధ్య పెద్ద వార్‌ నడిచింది. ఒకానొక దశలో రేగా దగ్గర మైక్‌ లాక్కొని, పొదెం హల్చల్‌ సృష్టించారు. గురువారం బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుల మధ్య సంభవించిన ఈ రసవత్తర సన్నివేశానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం బీసీ బంధు చెక్కుల పంపిణీ జరిగింది. భద్రాచలం నియోజకవర్గంలో ఈ పథకం కింద ఎంపికైన లబ్దిదారులతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే అయిన తనకు తెలియకుండా బీసీ బంధు లబ్దిదారుల ఎంపిక ఎలా చేస్తారంటూ బీసీ సంక్షేమ అధికారిని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యే ద్వారానే ఎంపికలు జరిగాయని.. ఇక్కడ ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని కోరారు. ఈలోగా బీసీ సంక్షేమ అధికారిని ఎమ్మెల్యే దగ్గర మైకు తీసుకొని.. ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావుకు ఇచ్చారు.. రేగా మాట్లాడే ప్రయత్నం చేయగా.. ఎమ్మెల్యే మైక్‌ లాక్కొని.. తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలని కోరారు. దాంతో వారివురి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సమావేశం హాల్లో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ తాతా మధు సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. కాగా, జిల్లాలో రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల అధ్యక్షులుగా ఉన్న పొదెం వీరయ్య, రేగా కాంతారావు.. గతంలో దుమ్ముగూడెం మండలంలో ఒకరికొకరు దుమ్మెత్తు పోసుకోగా, మరోమారు భద్రగిరి వేదికగా ఒకరికొకరు నువ్వెంత అంటే నువ్వెంత అన్న రీతిలో కయ్యానికి కాలు దువ్వటంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఒకరిద్దరికి చెక్కులు పంపిణీ చేసి ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.