సింగరేణిలో గండర గండ్రలు

Gandara Gandras in Singareni– భూపాలపల్లిలో ‘గండ్ర’ల మధ్యే పోటీ..
– మారుతున్న రాజకీయ సమీకరణలు
– బీఆర్‌ఎస్‌లో ప్రకంపనలు
నవతెలంగాణ-వరంగల్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో భూపాలపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానముంది. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థుల మధ్య పోటీ అత్యంత ఉత్కంఠభరితంగా జరుగుతోంది. ప్రతిసారీ ఇక్కడి ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్టుగా జరుగుతుండటం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచాక బీఆర్‌ఎస్‌లో చేరారు. తాజాగా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఇదిలావుంటే కాంగ్రెస్‌ తొలి జాబితాలోనే కాంగ్రెస్‌ అభ్యర్థిగా గండ్ర సత్యనారాయణరావు, బీజేపీ అభ్యర్థిగా చందుపట్ల కీర్తిరెడ్డి పేర్లు ఖరారయ్యాయి. దాంతో మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారవడంతో ఎవరికివారు తమదైన శైలిలో ఎత్తులు పైఎత్తులు వేస్తూ ప్రచారాన్ని ఉరకలెత్తిస్తున్నారు. తొలి నుంచే బీఆర్‌ఎస్‌ ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడం షురూ చేయగా, తాజాగా గండ్ర సత్యనారాయణరావు బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపాల్టీలోని ఐదుగురు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు హైదరాబాద్‌లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. దాంతో ఈసారి ‘గండ్ర’ల మధ్య రసవత్తరపోరు జరుగనున్నట్టు తెలుస్తోంది.
ఆ ఇద్దరి మధ్యే
భూపాలపల్లి నియోజకవర్గంలో అటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటరమణారెడ్డి, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థి సత్యనారాయణరావు ఇంటి పేర్లు ‘గండ్ర’నే కావడం గమనార్హం. ఈసారి పోటీ ఈ ఇద్దరు నేతల మధ్యనే ఉండనున్నది. 2009లో భూపాలపల్లి నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి, తన సమీప టీఆర్‌ఎస్‌ ప్రత్యర్థి సిరికొండ మధుసూదనాచారిపై 11,972 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి, కాంగ్రెస్‌ ప్రత్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డిపై 7,214 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావు గట్టి పోటీనిచ్చారు.
2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన గండ్ర వెంకటరమణారెడ్డి, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరపున పోటీ చేసిన గండ్ర సత్యనారాయణరావుపై 15,635 ఓట్లతో విజయం సాధించారు. ఇలా పలు ఎన్నికల్లో గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర సత్యనారాయణరావు, సిరికొండ మధుసూదనాచారి మధ్య ఉత్కంఠభరితంగా పోటీ సాగింది. ఈసారి ఇద్దరు ‘గండ్ర’లు పోటీలో ఉండగా ‘సిరికొండ’ పోటీలో లేరు. బీఆర్‌ఎస్‌లో కీలక నేతగా వ్యవహరిస్తున్న ‘సిరికొండ’ మద్దతుపై బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి.
భూపాలపల్లిలో తాజా చేరికలతో నియోజకవర్గంలో రాజకీయం మరింత వేడెక్కింది. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి వెంకటరమణారెడ్డి తరపున ఆయన సతీమణి, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ గండ్ర జ్యోతితోపాటు కుమారుడు గౌతంరెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణరావు ఒంటరి పోరాటంతో ప్రచారం ముమ్మరం చేశారు. ఏదేమైనా ఈసారి సింగరేణి కోటలో ఇద్దరు ‘గండ్ర’ల మధ్య మరోమారు ఉత్కంఠపోరు తప్పదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
నియోజకవర్గ తొలి ఎన్నిక నుంచి…
2009లో పరకాల నియోజకవర్గం నుంచి వేరుపడి భూపాలపల్లి నియోజకవర్గం ఏర్పడింది. తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగిన గండ్ర వెంకటరమణారెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో వెంకటరమణారెడ్డి ఓడిపోయి, 2018 ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు. తాజాగా జరగనున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా గత మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన గండ్ర సత్యనారాయణరావు ఈసారీ రంగంలోకి దిగుతున్నారు. కాగా, ఒకవైపు మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి గ్రూపు, మరోవైపు పార్టీలోని అసమ్మతి, అసంతృప్తితో ఉన్న ప్రజాప్రతినిధులు, నేతలు పక్క చూపులు చూడకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడం బీఆర్‌ఎస్‌ నేతలకు తలనొప్పిగా మారింది.