వెయ్యి గ్రామాల్లో గంగదేవిపల్లి మోడల్‌

– గ్రీన్‌ బిల్డింగ్‌ కాన్సెప్ట్‌లోనే సచివాలయం, కొత్త కలెక్టరేట్లు
– ఐజీబీసీ సమావేశంలో మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని వెయ్యి గ్రామాల్లో గంగదేవిపల్లి గ్రీన్‌ మోడల్‌ అమలు చేస్తామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. దేశంలో మొట్టమొదటి గ్రీన్‌ బిల్డింగ్‌, గ్రీన్‌హౌమ్‌, గ్రీన్‌ ఎయిర్‌పోర్టు లాంటివి తెలంగాణకు గర్వకారణమని అన్నారు. రాష్ట్ర సచివాలయం, జిల్లా కలెక్టరేట్లను గ్రీన్‌ బిల్డింగ్‌
వెయ్యి గ్రామాల్లో గంగదేవిపల్లి మోడల్‌ కాన్సెప్ట్‌లోనే నిర్మించామని తెలిపారు. గ్రీన్‌బిల్డింగ్‌ కౌన్సిల్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన గ్రీన్‌ ప్రాపర్టీ షోను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక హరితహారంతో తెలంగాణలో గ్రీన్‌ కవర్‌ 33 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఐఐ-ఐజీబీసీకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. రాష్ట్రంలో గ్రీన్‌ బిల్డింగ్‌కు అనేక రికార్డులున్నాయని తెలిపారు. నేడు దేశంలో గ్రీన్‌ ఇండ్లు పెరుగుతున్నాయని చెప్పారు. సీఐఐ-ఐజీబీసీ హైదరాబాద్‌లో 10.27 బిలియన్‌ చదరపు అడుగుల్లో నిర్మాణాలు పూర్తిచేసిందన్నారు. కొత్త సచివాలయ భవనం, టీ-హబ్‌, టీ-వర్క్స్‌, పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కొత్త కలెక్టరేట్‌ భవనాలు, ఆస్పత్రులు, హెల్త్‌కేర్‌ క్యాంపస్‌లు, ఇండిస్టీయల్‌ పార్కులు, ఐటీ టవర్లలో పచ్చదనాన్ని అమలు చేయడంతో తెలంగాణ పచ్చని బాటలో నడుస్తోందని చెప్పారు. భవనాలు, క్యాంపస్‌లు మాత్రమే కాకుండా హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌ పట్టణాల్లో ఐజీబీసీ ద్వారా గ్రీన్‌ సిటీస్‌ రేటింగ్‌ పెరుగుతోందని వివరించారు.నగరాలేగాక రాష్ట్రంలోని చాలా గ్రామాల్లోనూ గ్రీన్‌ బిల్డింగ్‌ సూత్రాలను అవలంబించాలని కోరుకుంటున్నామని చెప్పారు.
గ్రామీణ విద్యుద్దీకరణ, పారిశుధ్యం, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, మున్సిపల్‌ వ్యర్థాల నిర్వహణను మెరుగుపర్చడానికి, గ్రామాలు పచ్చగా మారడానికి వీలుగా పటిష్టమైన మౌలిక సదుపాయాల కల్పనపై తమ ప్రభుత్వం దష్టి పెడుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ, సైదిరెడ్డి, ఎమ్మెల్సీ భాను ప్రసాద్‌, సీఐఐ తెలంగాణ చైర్మెన్‌, ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ హైదరాబాద్‌ చాప్టర్‌ చైర్మెన్‌ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.