– వందల ఎకరాల్లో మిర్చి పంటను తొలగిస్తున్న రైతులు
– నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి : అన్నదాత
నవతెలంగాణ-చండ్రుగొండ
రైతుల పాలిట వైరస్లు శాపంగా మారాయి. గత సంవత్సరం తామర పురుగుతో అల్లాడిపోయిన రైతులు ఈ సంవత్సరం జెమినీ వైరస్ (బొబ్బలు) వ్యాది సోకి మిర్చి పంటలు పూర్తిగా తొలగిస్తున్నారు. దీంతో లక్షల్లో పెట్టుబడిన పెట్టిన రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. మండల వ్యాప్తంగా సుమారు నాలుగు వేల ఎకరాల్లో రైతులు మిర్చి పంటను సాగు చేసారు. మొక్కలు ఎదుగుదల సమయంలో మిరప పంటకు జెమినీ వైరస్ (బొబ్బలు) సోకి చెట్లు పూర్తిగా వాడిపోతున్నాయి. దీంతో ఆందోళన చెందిన రైతులు పంటలను కాపాడుకునేందుకు వివిధ రకాల పురుగు మందులను పంటపై పిచికారి చేశారు. అయినా కూడా మిర్చి తోటలకు వైరస్ ఊదృతి తగ్గకపోవడంతో ఇక చేసేదేమీ లేక రైతులు తమ పంటను తొలగిస్తున్నారు. మండల వ్యాప్తంగా పోకలగూడెం, వెంకటాయతాండ, గానుగపాడు, తుంగారం, మంగయ్య బంజర, రావికంపాడు, గ్రామాల్లో ఈ వైరస్ అధికంగా కనిపిస్తుంది. గానుగపాడు గ్రామంలో ఇంజం పూర్ణ మహేష్ బాబు తనకున్న 16 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాడు. 10 ఎకరాలకు పైగా ఈ బొబ్బల వైరస్ సోకడంతో పంటను పూర్తిగా తొలగించాడు. ఇప్పటివరకు సుమారు 8 లక్షలకు పైగా పంటకు పెట్టుబడి పెట్టినట్లుగా తెలిపాడు. ఇదే రీతిలో మిగతా గ్రామాల రైతుల కూడా తమ పంటను పూర్తిగా తొలగిస్తున్నారు. ఓవైపు వైరస్‌లతో రైతు విలవిలా లాడుతుంటే అసలు మందే లేని వైరస్‌కు రైతులకు పనికిరాని పురుగుమందులు అమ్మడంతో రైతులు మరింత నష్టాల బారిన పడుతున్నారు. మండల వ్యాప్తంగా రైతులు సాగుచేసిన మిరప తోటలో జెమినీ వైరస్ (బొబ్బలు) సొగడంతో పంటలపై ఏ మందులు పిచికారి చేయాలో తెలియని రైతులు పురుగుమందుల డీలర్ల వద్దకు క్యూ కడుతున్నారు. దీంతో రైతులు లక్షల్లో పెట్టుబడులు పెట్టి అప్పుల ఊబిలోకి వెళ్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశించి రైతులు అవగాహన కల్పించాలని రైతులు కోరుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా మిర్చి తోటలు సాగు అనుకూలంగా ఉండడంతో ఈ సంవత్సరం రైతులు ఎక్కువ మొత్తంలో మిర్చి సాగు చేశారు. తొలిదశలోనే వైరస్ ఉదృతంగా ఉండటంతో రైతులు ఏ విధమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలో వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నారు.
జెమినీ వైరస్ రావడానికి ముఖ్య కారణం పంటమార్పిడి చేయకపోవడమే
మండల వ్యవసాయ అధికారి వినయ్
తెల్ల దోమ వాతావరణ మార్పులు తదితర కారణాలవల్ల మిర్చి పంటను వైరస్ సోకడం జరుగుతుంది. దీనికి రైతుల ముఖ్యంగా ఎక్కువ మోతాదులో పురుగుమందులను కాకుండా సేంద్రీయ పద్ధతుల అవలంబించడం, వైరస్ సోకిన మొక్కలను తొలి దశలోనే పీకి వేసి కొత్త వాటిని వేసుకోవడం ద్వారా కొంతమేర వైరస్ ఉదృతి నుండి పంటను కాపాడుకోవచ్చు. ముందస్తుగా వేసిన తోటల్లో ఈ వైరస్ ఎక్కువగా కనబడుతుంది.