– రూ.60-70కి చేరే అవకాశం
న్యూఢిల్లీ : నిన్న టమాటా…రేపు ఉల్లి. టమాటా ధర ఇప్పటికే కొండెక్కి కూర్చోగా ఉల్లిగడ్డలు ఈ నెలాఖరు నుండి మరింత ఘాటెక్కబో తున్నాయి. సెప్టెంబర్ నాటికి ఉల్లి ధర కిలో రూ.60 నుండి 70 వరకూ చేరుతుందని అంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ధరలు పెరుగుతాయని మార్కెట్ విశ్లేషకులు తెలిపారు. అయితే 2020 నాటి పరిస్థితి తలెత్తకపోవచ్చునని వారు చెప్పారు. ‘సరఫరా-డిమాండ్ అసమానతలు ఆగస్ట్ చివరి నాటికి ఉల్లి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రిటైల్ మార్కెట్‌లో సెప్టెంబర్ ప్రారంభం నుండే ధరలు గణనీయంగా పెరగవచ్చు. కిలో రేటు రూ.60-70 పలకవచ్చు. అయితే 2020లో పెరిగినంతగా ఉండదు’ అని క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ సంస్థ వివరించింది. బహిరంగ మార్కెట్‌లో రబీ పంట నిల్వలు సెప్టెంబర్‌కు బదులుగా ఆగస్ట్ చివరి నాటికే బాగా తగ్గుతాయని, దీంతో సరఫరాలు తగ్గి ధరలు పెరుగుతాయని తెలిపింది. అక్టోబర్‌లో ఖరీఫ్ పంట చేతికి వచ్చే దాకా సరఫరాలు తక్కువగానే ఉండి, ఫలితంగా ధరలు పెరుగుతాయి. అక్టోబర్-డిసెంబర్ మధ్యకాలంలో ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జనవరి-మే మధ్యకాలంలో ఉల్లి ధరలు తగ్గడం వల్ల వినియోగదారులకు ఊరట లభించింది. అయితే ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు రాబోయే ఖరీఫ్ సీజన్‌లో ఉల్లి పంట వేసేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల ఈ సంవత్సరం పంట సాగు విస్తీర్ణం 8%, దిగుబడులు 5% తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఆగస్ట్, సెప్టెంబర్‌లో కురిసే వర్షాలు పంట సాగును నిర్ధారిస్తాయి.
ఘాటెక్కనున్న ఉల్లి వచ్చే నెలలో కిలో
6:08 am