మెడికల్‌ సీట్లు ఇవ్వండి

–  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలోని 54 వైద్య కళాశాలల్లో తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసేందుకు కాళోజీ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు అనుమతిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏర్పాటు చేసిన మెడికల్‌ కాలేజీల్లో కాంపిటేటివ్‌ అథారిటీ కోటాలోని మెడికల్‌, డెంటల్‌ కోర్సు సీట్లు తెలంగాణ స్టూడెంట్స్‌కే చెందుతాయని పేర్కొంటూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 72ను సవాల్‌ చేసిన పిటిషన్‌లో హైకోర్టు పైవిధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ జీవోను ఏపీకి చెందిన ఆరుగురు విద్యార్థులే సవాల్‌ చేశారని, ఈ కారణంగా 53 కాలేజీల్లో సీట్ల కేటాయింపు నిలిపివేయలేమని చెప్పింది. తమ ఉత్తర్వుల తర్వాత ఆరుగురు విద్యార్థులకు సీట్లు వస్తే సమస్యే లేదని, సీట్లు రాకపోతే ఏం చేస్తారో చెప్పాలని యూనివర్సిటీని ఆదేశించింది. విచారణను ఈ నెల 23కి వాయిదా వేస్తూ చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే ఆధ్వర్యంలోని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత నెలకొల్పిన 34 కాలేజీల్లో ఆ కోటా సీట్లన్నీ తెలంగాణ విద్యార్థులకే చెందుతాయని, రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న 20 కాలేజీల్లోని ఆ కోటా సీట్లు ఏపీ, తెలంగాణ విద్యార్థులకు చెందుతాయని ప్రభుత్వం చెప్పింది. రాష్ట్ర విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో 72 ఉందని, తెలంగాణలోని కొత్త, పాత కాలేజీలన్నింటిలోనూ ఆ కోటా సీట్లు ఏపీ స్టూడెంట్స్‌కు కూడా లభిస్తాయనేది పిటిషనర్ల వాదన.