మీ అభిప్రాయం చెప్పండి

మీ అభిప్రాయం చెప్పండి– న్యూస్‌క్లిక్‌ పిటిషన్‌పై కేంద్ర సంస్థలకు సుప్రీం నోటీసులు
–  ‘స్వాధీనాల’పై మార్గదర్శకాలు అవసరమన్న పిటిషనర్లు
న్యూఢిల్లీ : ఆన్‌లైన్‌ న్యూస్‌ పోర్టల్‌ న్యూస్‌క్లిక్‌, దాని వ్యవస్థాపక సంపాదకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ దాఖలు చేసిన పిటిషన్లపై అభిప్రాయాన్ని తెలియజేయా ల్సిందిగా సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐ, ఈడీ, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. సోదాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాల స్వాధీనం విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని పిటిషనర్లు అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ పోలీసుల ప్రత్యక విభాగానికి చెందిన అధికారులు గత సంవత్సరం అక్టోబరులో న్యూస్‌క్లిక్‌ పోర్టల్‌ ఉద్యోగులు, కంట్రిబ్యూటర్ల నివాసాలపై దాడి చేసి, వారి నుండి ఎలక్ట్రానిక్‌ పరికరాలను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. భారత ప్రభుత్వ విధానాలను విమర్శించేందుకు న్యూస్‌క్లిక్‌ చైనా నుండి నిధులు పొందిందని పోలీసులు ఆరోపించారు. దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసేందుకు, భారత్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు జరిపిన ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేసిందని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను న్యూస్‌క్లిక్‌ తోసిపుచ్చింది. దాడులు చేసేటప్పుడు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు స్వాధీనం చేసుకునేటప్పుడు అనుసరించాల్సిన పద్ధతులపై మార్గదర్శకాలు జారీ చేయాలని న్యూస్‌క్లిక్‌, ప్రబీర్‌ పుర్కాయస్థ న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై న్యాయమూర్తులు బీఆర్‌ గవారు, సందీప్‌ మెహతాతో కూడిన బెంచ్‌ కేంద్రం, ఢిల్లీ పోలీసులు, సీబీఐ, ఆదాయపన్ను శాఖ, ఈడీ నుండి స్పందనలు కోరింది. ప్రారంభంలో పిటిషన్‌ను అనుమతిం చేందుకు న్యాయస్థానం విముఖత ప్రదర్శించింది. ఆర్టికల్‌ 32 ప్రకారం ప్రతి ఒక్కరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడాన్ని ఆమోదించలేమని జస్టిస్‌ గవారు తెలిపారు. ప్రాథమిక హక్కుల అమలుకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 32 వీలు కల్పిస్తోంది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ ఎలక్ట్రానిక్‌ పరికరాల స్వాధీనానికి సంబంధించి దాఖలైన ఇతర పిటిషన్లను గతంతో కోర్టు అనుమతించిందని గుర్తు చేశారు. దీంతో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసేందుకు న్యాయస్థానం అంగీకరించింది. వీటిని ఇదే రకమైన ఇతర పిటిషన్లతో జత చేయాలని ఆదేశించింది.