– ప్రముఖులను కలిసిన సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్
– కమ్యూనిస్టులు చట్ట సభల్లో ఉండాలి
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిరంతరం ఆందోళన చేస్తున్న ఖమ్మం అసెంబ్లీ సీపీఐ(ఎం) అభ్యర్థి యర్రా శ్రీకాంత్ గెలుపు కోరుతూ మంగళవారం నగరంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం పుర ప్రముఖులు మేకుల బిక్షంను కలిసి తమ పార్టీని గెలిపించాలని శ్రీకాంత్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ మాజీ చైర్మన్ చిర్రవూరి లక్ష్మి నర్సయ్య నీతి నిజాయితీగా పని చేశారని వారి అడుగు జాడల్లో నడవటానికి తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు నిర్వహించినట్లు, రాబోయే కాలంలో కమ్యూనిస్టులు చట్ట సభల్లో వుండటం అవసరమని తెలిపారు. వివిధ పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, కానీ ప్రజా సమస్యలపై, కార్మిక సమస్యలపై పోరాటాలు చేసింది కేవలం సీపీఐ(ఎం) మాత్రమే అని పేర్కొన్నారు. ఈ ప్రచారంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై విక్రమ్, కళ్యాణం వెంకటేశ్వరరావు, నాయకులు టి విష్ణు వర్ధన్, బండారు యాకయ్య తదితరులు పాల్గొన్నారు.