ఊహించని ట్విస్ట్‌ ఇస్తా..

ఊహించని ట్విస్ట్‌ ఇస్తా..ఫుల్‌ మూన్‌ మీడియా ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం-1గా రూపొందిన చిత్రం ‘సౌండ్‌ పార్టీ’. వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్‌ జంటగా నటించారు. జయ శంకర్‌ సమర్పణలో సంజరు శేరి దర్శకత్వం వహించారు. రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్‌ గజేంద్ర నిర్మాతలు. ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా ఈనెల 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్‌ హ్రితిక శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ, ‘సీనియర్‌ నటి ఆమని మా అత్తయ్య అవటంతో చిన్నప్పుడు నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేది. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించాను. హీరోయిన్‌గా ‘అల్లంత దూరాన’ తర్వాత నటించిన రెండవ చిత్రమిది. దర్శకుడు సంజరు కథ చెప్పినప్పుడు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. ఇదొక కంప్లీట్‌ ఫన్‌ ఎంటర్టైనర్‌. కామెడీతోపాటు కంటెంట్‌ కూడా ఉంది. ఇందులో నేను సిరి అనే పాత్రలో నటించాను. చాలా తెలివైన అమ్మాయి. సినిమాలో నా పాత్ర చాలా ఇంపార్టెంట్‌గా ఉంటుంది. క్రికెట్‌ టీమ్‌లో ధోనీలా నా పాత్ర ఉంటుందని డైరెక్టర్‌ అంటుంటారు. సినిమా క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్ట్‌ ఇస్తాను. లాస్ట్‌లో వచ్చి ధోని ఎలా సిక్స్‌లు కొడతారో అలా నా పాత్ర ఉందని చెప్పుకుంటారు. అమాయకులైన తండ్రీ కొడుకులు ఈజీ మనీ కోసం ఎలాంటి పనులు చేస్తారనేది ఈ సినిమా మెయిన్‌ కాన్సెప్ట్‌. ఇందులో బిట్‌ కాయిన్‌ గురించి కూడా ఉంటుంది. డైరెక్టర్‌ సంజరు రైటింగ్‌ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయన కామెడీ టైమింగ్‌ చాలా బాగుంటుంది. మా నిర్మాతలు సినిమా కోసం ఎక్కడా రాజీపడలేదు’ అని తెలిపారు.