భూ ఆక్రమణల దారులను వదిలి గుడిసె వాసుల పై ప్రతాపమా?

– పేదలకు ఇండ్ల స్థలాలు,ఇండ్లు నిర్మించే వరకు పోరాటం
– సిఐటియు ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య
నవతెలంగాణ – అశ్వారావుపేట
నిలువ నీడ లేని నిరుపేదలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థలాలు ఇచ్చి,గృహాలు నిర్మించాల్సి ఉండగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు వేసుకున్న గుడిసెలు సైతం ధ్వంసం చేస్తూ అధికారులు అరాచకాలను సాగిస్తున్నారని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య ఆవేదన వ్యక్తం చేసారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో ఈ 14 నుండి 16 వరకు నిర్వహించే రాజకీయ శిక్షణా తరగతులు స్థానిక లహరి ఫంక్షన్ హాల్ లో బుధవారం ప్రారంభం అయ్యాయి.ముందుగా శిక్షణా తరగతులు ప్రారంభం సూచికగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన రావు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు.తరగతులు ప్రారంభానికి ముందు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ఉద్యమంలో భాగస్వాములై పలు అనారోగ్యం కారణాలతో మృతి చెందిన నాయకులకు,కార్యకర్తలకు సంతాపం తీర్మాణం ప్రకటించారు. అనంతరం సంఘం రాష్ట్ర కార్యదర్శి టి.సాగర్ ప్రిన్సిపాల్ వ్యవహరించిన ఈ తరగతుల్లో వీరయ్య “రాజకీయ పరిస్థితులు” అనే అంశాన్ని రైతు ప్రతినిధులకు బోధించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో 6 పోరాట కేంద్రాల్లో ప్రజా సంఘాల పోరాట వేదిక ఆద్వర్యంలో వేలాది మంది పేదలు ఇండ్లు,ఇండ్ల స్థలాలు కోసం పోరాటం చేస్తుంటే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు వీరికి ఇళ్ళ స్థలాలకు పట్టాలు ఇచ్చి, ఇండ్లు నిర్మించాల్సి ఉంది అని కానీ కొన్ని జిల్లాల్లో రెవిన్యూ,పోలీస్ అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కు అయి పేదలు గుడిసెలను ధ్వంసం చేస్తూ అదే పేదలు చేస్తున్నారని అన్నారు. మహబూబాబాద్ లో సోమవారం తెల్లవారు జాము 4 గంటలు నుండి మంగళవారం మధ్యాహ్నం 2 గంటలు వరకు గుడిసెలు కూల్చే పనిలో ప్రభుత్వ అధికారులు తలమునకలు అయ్యారని ఎద్దేవా చేసారు.ఏళ్ళతరబడి ప్రభుత్వ భూములను ఆక్రమించిన పెద్దలను వదిలేసి పేదలు గుడిసెలు కూల్చడం ఏమిటని ప్రశ్నించారు.కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస యోజన పధకం ద్వారా,రాష్ట్రప్రభుత్వం డబుల్ బెడ్ రూం పధకం ద్వారా పేదలకు గృహాలు నిర్మించి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అవి సఫలం కాలేదని అన్నారు. 58 జి.ఒ ప్రకారం స్వాధీనంలో ఉన్న భూములకు ఇంటి పట్టాలు ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ 59 జి.ఒ తెచ్చి తిరిగి ధనవంతులు కే మేలు చేస్తున్నాడని తెలిపారు. పేదలకు ఇళ్ళు,ఇళ్ళ స్థలాలు సాధించే వరకు పోరాటం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక నిర్ణయించిందని,ఆ మేరకు ఈ నెల 19 నుండి 24 వరకు పేదలు తో వ్యక్తిగతంగా తహశీల్దార్ కు దరఖాస్తులు చేయించడం,ధర్నాలు చేపడతాం అని అన్నారు.18 నుండి 21 వరకు 61 పోరాటాలు కలుపుతూ బస్సు యాత్ర చేపట్టి పేదలను సమీకరించి పోరాటాలకు సన్నద్దం చేస్తామని ప్రకటించారు.చివరి గా జులై 3 న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాలు ముందు మహాధర్నా నిర్వహించిన పేదలు గొంతుక గా ప్రభుత్వానికి మొర వినిపిస్తాం అని అన్నారు. “రైతు ఉద్యమం” అనే అంశం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన రావు బోధించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, మాదినేని రమేష్,వి వెంకటేశ్వర్లు,శెట్టి వెంకన్న, సహాయ కార్యదర్శులు కందాల ప్రమీల, బొంతు రాంబాబు, డి బాల్ రెడ్డి, ఎం శ్రీనివాస్, బాలరాజు గౌడ్ రాష్ట్ర కమిటీ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యలమంచిలి వంశీ క్రిష్ణ, అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.