తెలంగాణలో సంక్షేమానికి స్వర్ణయుగం

– ఆసరా, ఇతర పింఛన్లకే రూ.58వేల కోట్లు
– రూ.5లక్షల కోట్లతో సంక్షేమ పథకాలు
– దశాబ్ది ఉత్సవాల్లో నేడు సంక్షేమ రంగం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలకు, ఆసరా అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ప్రతి ఏటా రూ.50 వేల కోట్లకుపైగా నిధులతో పలు రకాల ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సంక్షేమ రంగంపై ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రకటన జారీచేశారు. పదేండ్లకు చేరుకున్న స్వరాష్ట్ర పాలనా కాలంలో దాదాపు రూ.5 లక్షల కోట్లను ఆసరా ఫించన్లు సహా పలు రకాల సంక్షేమ పథకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆసరా ఫించన్లు, ఇతర సంక్షేమ పథకాలు పేదల్లో ఆర్థిక భరోసాను ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆసరా పెన్షన్‌ కాకుండా…రైతులకు పంటపెట్టుబడి వంటి వ్యక్తిగత ఆర్థిక సాయం సామాజిక పెట్టుబడిగా మారింది. ‘రూపాయి ప్రజల్లో తిరిగడం ద్వారా స్పిన్‌ ఆఫ్‌ ఎకానమీకి దారితీసింది. ప్రజల కొనుగోలు శక్తి పెరిగి తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచింది.
ఎస్సీల సంక్షేమం
స్వతంత్ర భారతంలో ఈనాటికీ ఈ వివక్ష కొనసాగడం అత్యంత హేయమైన చర్యగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ కులాల అభివద్ధి దిశగా పలు సంక్షేమ అభివద్ధి పథకాలను అమలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్సీ కులాలను అటు సామాజిక వివక్ష నుంచి దూరం చేయడంతోపాటు, ఇటు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే దళితబంధు కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది. ఈ పథకం కింద ఎలాంటి బ్యాంకు లింకేజీగానీ, సెక్యూరిటీగానీ లేకుండా, లబ్ధిదారుడు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వమే రూ.10లక్షల గ్రాంటును ఉచితంగా అందజేస్తుంది. దళితులను స్వయం సమద్ధులుగా, వ్యాపార వర్గాలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఏడాదిలో దీనికోసం రూ.17,700కోట్లను సర్కార్‌ కేటాయించింది.
ఎస్టీల సంక్షేమం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో నేడు గిరిజనులు ఆత్మగౌరవంతో, భవిష్యత్‌ మీద భరోసాతో ఉన్నారు. గిరిజనుల్లోని అనేక తెగలు విద్యాధికులుగా, పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా, రాజకీయాల్లో రాణిస్తూ అబివృద్ధి బాటలో పయనిస్తున్నారు. యావత్‌ దేశంలోనే నేడు తెలంగాణలో గిరిజనుల సంక్షేమం పరిఢవిల్లుతున్నది. ఎస్టీల కోసం ప్రత్యేక ప్రగతిని ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్టీల కోసం ఖచ్చితంగా అత్యధిక నిధులను కేటాయించాలనే నిబంధనను పటిష్టంగా అమలు చేస్తున్నది. గిరిజన సంస్కతి, సాంప్రదాయాలను ఇనుమడింపజేసేందుకు వారి పండుగలైన సంత్‌ సేవాలాల్‌ జయంతి, కుమరంభీం జయంతి, వర్ధంతులు, బౌరాపూర్‌ జాతర, జంగుబాయి జాతర, నాచారం జాతరలకు ప్రభుత్వం ప్రతిఏటా నిధులు విడుదల చేస్తూ, అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నది. ప్రభుత్వం రెండేళ్ళకోసారి వచ్చే మేడారం జాతర కోసం ప్రతీ ఏటా రూ. 354 కోట్లను విడుదల చేస్తున్నది.
బీసీల సంక్షేమం
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల్లోని ప్రతీ కులానికి ప్రత్యక్ష ప్రయోజనాలను చేకూర్చేలా ప్రవేశపెట్టిన పథకాలు ఆ కులాల్లో గుణాత్మక మార్పుకు దోహదం చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పథకాలతో సామాజికంగా, ఆర్థికంగా, విద్యా పరంగా మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. కుల వృత్తులను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం తెచ్చిన పథకాలతో ప్రతి పల్లె స్వయం సమృద్ధి సాధించి పల్లెలే ప్రగతికి పట్టుకొమ్మలనే నానుడిని నిజం చేస్తున్నాయి. పోస్ట్‌-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లు, ప్రీ-మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల నుండి డే స్కాలర్‌షిప్‌లు, మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమం ద్వారా రూ.5001.53 కోట్లు ఖర్చు చేసింది.
కల్యాణలక్ష్మి / షాదీ ముబారక్‌
ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్‌ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. నేతన్నల జీవితాలలో వెలుగులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ, సహాయ కార్యక్రమాలను చేపట్టింది. చేనేత కార్మికులకు నూలు, రంగులపై కేంద్ర ప్రభుత్వం కేవలం 10 శాతం సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకొంటే, తెలంగాణ ప్రభుత్వం చేనేత మిత్ర పథకం కింద 40 శాతం సబ్సిడీ అందిస్తున్నది.
మైనారిటీల సంక్షేమం
సర్వమత సమభావన పునాదిగా అన్నివర్గాలలో విశ్వాసాన్ని నెలకొల్పుతూ, ఎవరిపట్లా వివక్షా, ఉపేక్షా లేకుండా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ ఫలాలను సర్వజనులకూ అందిస్తున్నది. మైనారిటీల అభివద్ధి కోసం అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నది. సమాజంలో అణగారిన వర్గాలతో పాటు అగ్రవర్ణాల పేదలకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. దేవాలయాలను నమ్ముకొనిజీవనం సాగిస్తున్న నిరుపేద బ్రాహ్మణులకు ధూపదీప నైవేద్యం పథకం ద్వారా ఆదుకుంటున్నది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆలయాలలో విధులు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఖజానా నుంచి నెలనెలా వేతనాలు అందిస్తున్నది.