రిలయన్స్‌కు 1.67 లక్షల ఉద్యోగులు గుడ్‌బై..

Goodbye 1.67 lakh employees to Reliance..– జియోకు 41వేల మంది రాజీనామా
– ఏడాదిలోనే కంపెనీని వీడారు
న్యూఢిల్లీ : కార్పొరేట్‌ కంపెనీల్లో సాధారణంగా పని ఒత్తిడికి తోడు కష్టానికి తగ్గ వేతనాలు ఇవ్వరనే అరోపణలు ఉన్నాయి. అధిక పనికి తోడు చేసిన కష్టానికి ఫలితం దక్కకపోవడంతో సిబ్బంది నిరాశ చెందుతుంటారు. కొత్త అవకాశాలను వెతుక్కునే వారూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రిలయన్స్‌ ఇండిస్టీస్‌ గ్రూప్‌లోని వేలాది మంది ఉద్యోగులు ఆ సంస్థకు గుడ్‌బై చెప్పారేమో. గడిచిన ఆర్థిక సంవత్సరం (2022-23)లో ఏకంగా రిలయన్స్‌ను 1.67 మంది ఉద్యోగులు వీడారు. వీరిలో రిలయన్స్‌ జియో, రిలయన్స్‌ రిటైల్‌ విభాగాలకు చెందిన వారు మెజారిటీగా ఉన్నారు. 2022-23లో రిలయన్స్‌ టెలికాం విభాగమైన జియోకు 41,818 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. ఇక రిలయన్స్‌ రిటైల్‌ విభాగంలో 1,19.229 మంది మానేశారు. ఒక్క ఏడాదిలోనే మొత్తంగా రిలయన్స్‌ గ్రూప్‌లో 1,67,391 మంది ఉద్యోగులు ఇంటి బాట పట్టారు. రిలయన్స్‌ వార్షిక నివేదికలో ఈ గణాంకాలు వెల్లడయ్యాయని బుధవారం పలు రిపోర్ట్‌లు వచ్చాయి.
రిలయన్స్‌లో ఉద్యోగాలు వీడే వారి శాతం (అట్రిషన్‌ రేట్‌) అంతకుముందు ఏడాదితో పోల్చితే 64.8 శాతం పెరగడం గమనార్హం. రాజీనామా చేసిన వారిలో ఎక్కువ మంది జూనియర్‌ స్థాయి నుంచి మధ్యస్థాయి మేనేజ్‌మెంట్‌ ఉద్యోగులే ఉన్నారని సమాచారం. ఇటీవల కాలంలో రిలయన్స్‌ కంపెనీ వరుసగా ఇతర రిటైల్‌ స్టార్టప్‌లను కొనుగోలు చేస్తోంది. అయితే ఉద్యోగుల సర్ధుబాటు, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లారని అంచనా. అయితే ఖర్చులు తగ్గించేందుకు రిలయన్స్‌ కొంత మంది ఉద్యోగులను స్వతహాగా తప్పుకోమని ఆదేశించిందని సమాచారం. అదే సమయంలో కొత్తగా 2,62,558 మంది ఫ్రెషర్‌్‌సను వివిధ విభాగాల్లో నియమించుకుంది. జియో మార్ట్‌లో పొదుపు చర్యల్లో భాగంగా ఈ ఏడాది మే నెలలో 1,000 మంది పైగా సిబ్బందికి ఉద్వాసన పలికిందని సమాచారం. ఆగస్ట్‌ 28న రిలయన్స్‌ 46వ వార్షిక సర్వసభ్య సమావేశం జరగనుంది. ఇందులో కంపెనీ ఛైర్మన్‌ ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ లక్ష్యాలు, ప్రణాళికలను వెల్లడించే అవకాశం ఉంది. ఉద్యోగుల వేతన పెంపు, మరింత భద్రతకు సంబంధించిన నిర్ణయాలు ఏమైనా ఉంటాయేమో వేచి చూడాలి.