మహిళా సంక్షేమానికి సర్కారు పెద్దపీట..

నవతెలంగాణ – గంగాధర: రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలోని వీఏఎస్ గార్డెన్లో నిర్వహించిన మహిళా అభివృద్ధి, సంక్షేమ సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు. స్వశక్తి సంఘా మహిళలకు పావలా వడ్డీ, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పైసా ఖర్చు లేకుండా కడుపు కోతలులేని సహజ కాన్పులు పెరిగాయని అన్నారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, అంగన్వాడీల ద్వారా బాలింతలు, గర్భిణీ స్త్రీలు, కిశోర బాలికలకు నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. మహిళలు స్వశక్తితో ఆర్థిక అభివృద్ధి చెందేలా ప్రభుత్వం పొదుపు పథకాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు ఎంపీపీలు కలిగేటి కవిత, కొడిమ్యాల ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీలు ప్రశాంతి, ఉమ, ఐసీడీఎస్ సీడీపీవో కస్తూరి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.