ప్రజా సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

ప్రజా సంఘాల పోరాట వేదిక
తుర్క యాంజాల్‌ మున్సిపల్‌ కమిటీ
నవతెలంగాణ-తుర్కయాంజల్‌
ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ మన్నెగూడ, ఎన్‌ఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీలో ఆదివారం ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల పోరాట వేదిక జిల్లా నాయకులు, సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు డి.కిషన్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందనీ అన్నారు. ఆదివారం ఎన్‌ఎస్‌ఆర్‌ నగర్‌ కాలనీలో సీపీఐ(ఎం) ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుంటూ సర్వే చేసినట్టు తెలిపారు. సర్వే సందర్భంగా అనేక మంది సొంత ఇండ్లు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లతో పాటు రేషన్‌ కార్డులు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతుందన్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వం ప్రభుత్వ భూమిని అంతా కూడా హెచ్‌ఎండిఏ పేరుతో 17700 ఎకరాలను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పనంగా అప్పజెప్పిందని, పేదవాడికి గుడు వేసుకోవడానికి 60 గజాల జాగా ఇవ్వమంటే పేదలపై లాఠీచార్జీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌ఎస్‌ఆర్‌నగర్‌ కాలనీలో అనేక మందికి పింఛన్లు, రేషన్‌ కార్డులు రావడం లేదని, అర్హులైన నిరుపేదలందరికీ వెంటనే ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 19న స్థానిక సమస్యల పరిష్కారం కోసం తహసీల్దార్‌ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తుర్కయంజాల్‌ మున్సిపల్‌ ప్రాంతంలోని ప్రజలు స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద ఇంటి జాగాల కోసం 4300 మంది వరకు అర్జీలు పెట్టుకున్నారని ఇప్పటివరకూ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రావడం లేదన్నారు. ప్రభుత్వం పేదలకు ఇంటి జాగాలు ఇవ్వకపోతే సమీప భవిష్యత్తులో ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గుడిసెలు వేయటానికి కూడా పూనుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఆర్‌నగర్‌ కార్యదర్శి కొండి గారి శంకర్‌, ఆశీర్వాదం, ఎం.సత్యనారాయణ, బి శంకరయ్య, కేవీపీఎస్‌ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి ప్రకాష్‌ కారత్‌, సీఐటీయూ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డి.శ్రీదర్‌, సీఐటీయూ నాయకులు పెంటయ్య, యాదగిరి లక్ష్మయ్య, ఎం.యాదయ్య, లింగం, సాయి, శంకరయ్య, మధు, కృష్ణ, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.