బిల్లులను తొక్కిపెడుతున్న గవర్నర్‌

Bills A trampling governor– కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ ఆందోళన
– సుప్రీంకు వెళ్తామని వెల్లడి
తిరువనంతపురం : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 8 బిల్లులను రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 200 ప్రకారం గవర్నర్‌ ఆమోదానికి పంపి, చాలా కాలం అయినా ఇంతవరకు వాటిపై సంతకం చేయలేదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల అభీష్టాన్ని ప్రతిబింబించేలా శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నరు తొక్కిపట్టడం పార్లమెంటరీ ప్రజాస్వామ్య స్పూర్తికే విరుద్ధమని అన్నారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌ కోరిన వివరణలను సంబంధిత మంత్రులు, అధికారులు ఇచ్చారు. అయినా, ఈ బిలులపై గవర్నరు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నాన్చుతున్నారని ఆయన అన్నారు..యుజిసి నిబంధనల ప్రకారం కేరళలో యూనివర్సిటీ చట్టాల ఏకీకరణకు సంబంధించిన బిల్లుకు ఇంతవరకు మోక్షం లభించలేదు. ఈ కారణంగా యూనివర్సిటీల్లో వైస్‌ ఛాన్సలర్ల నియామకం నిలిచిపోయింది.కేరళ పబ్లిక్‌ హెల్త్‌ బిల్లును కూడా తొక్కిపట్టారు. గవర్నర్‌ తనకు విచక్షణాధికారాలు ఉన్న వాటిలో మినహా మిగతావాటిలో ఎన్నికైన ప్రభుత్వాల సలహాలు, సహకారంతో వ్యవహరించాలని రాజ్యాంగ పరిషత్తులో చర్చలు స్పష్టం చేస్తున్నాయి. వలస ప్రభుత్వ పాలనలో ప్రాంతీయ ప్రభుత్వాలు విస్తత విచక్షణాధికారాలను కలిగి ఉండేవి. 1937లో, అప్పటి భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ప్రావిన్సులలో ఎన్నికలు జరిగినప్పుడు, భారత జాతీయ కాంగ్రెస్‌ 5 ప్రావిన్సులలో మెజారిటీ సాధించింది. అయినప్పటికీ, మహాత్మా గాంధీతో సహా జాతీయ నాయకులు గవర్నర్‌లకు ఇచ్చిన విస్తతమైన విచక్షణ అధికారాలను తొలగించాలని పట్టుబట్టారు ప్రావిన్సులలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడానికి నిరాకరించారు. సాధారణ చట్టాల ఆమోదం ఆలస్యం చేయడం వల్ల ప్రజలకు బాధ్యత వహించే ప్రభుత్వ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ, తమిళనాడు సహా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశాన్ని లేవనెత్తుతూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
2025 నవంబరు నాటికి … తీవ్ర పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ
2025 నవంబర్‌ 1 నాటికి కేరళను తీవ్ర పేదరికం నుండి విముక్తి చేయడమే తమ లక్ష్యమని కేరళ ముఖ్యమంత్రి విజయన్‌ ప్రకటించారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందన్నారు.