బీసీలపై ప్రభుత్వ చిన్నచూపు

– బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అసెంబ్లీలో అడిగే వారే లేరనే బీసీలపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్‌ విమర్శించారు. అధికారంలో భాగస్వామ్యం కానంత వరకు బీసీల తలరాతను ఎవరూ మార్చలేరని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీసీలకు ఎంత అన్యాయం జరిగినా అడిగేవారే లేరనే అహంతో ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోకుండా హడావుడిగా కుల వృత్తులకు అందిస్తున్న రూ.లక్ష సాయానికి సంబంధించిన దరఖాస్తులను హఠాత్తుగా ప్రభుత్వం నిలిపేసిందని తెలిపారు. ఇది ఎన్నికల స్టంట్‌గా కాకుండా సంతృప్తికరమైన ప్రణాళికతో అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రూ.వంద కోట్లతో రూ.లక్ష సాయం చొప్పున పది వేల మందికే అందుతుందని వివరించారు. రాష్ట్రంలో 45 లక్షల బీసీ కుటుంబాలను ప్రభుత్వం ఎలా ఆదుకుంటుందో జవాబు చెప్పాలని కోరారు. అది లోపభూయిష్టంగా ఉందని తెలిపారు. మున్నూరుకాపు, ముదిరాజ్‌, యాదవ, పద్మశాలీ, గౌడ కులాలను చేర్చకపోవడం చూస్తే కులాల మధ్య చిచ్చుపెట్టాలనే భావన ప్రభుత్వంలో ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతున్నదని పేర్కొన్నారు. బీసీలకు అని రాజకీయ పార్టీలూ రానున్న ఎన్నికల్లో 50 శాతం టికెట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దాని ప్రాధాన్యతను సృష్టించేలా కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.