నవతెలంగాణ- విలేకరులు
గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మెలో భాగంగా సోమవారం అన్ని మండల కేంద్రాల్లో రాస్తారోకోలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ కేంద్రంలో గాంధీ విగ్రహం వద్ద జేఏసీ జిల్లా నాయకులు గూడూరి భాస్కర్ ఆధ్వర్యంలో జీపీ కార్మికులు భారీ రాస్తారోకో నిర్వహించారు. ములుగు జిల్లా తాళ్లపాగు సెంటర్‌లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రం నెహ్రూ సెంటర్‌లో జీపీ కార్మికులు మోకాళ్ళపై నిల్చొని నిరసన తెలిపారు. పలు సెంటర్‌లలో భిక్షాటన చేశారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్‌లో సీఐటీయు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో కొత్తగూడెం – ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు.
యాదాద్రిభువనగిరి జిల్లా బొమ్మలరామారం మండల కేంద్రంలో జీపీ కార్మికులు బోనాలు ఎత్తారు. భువనగిరి, తుర్కపల్లి, చౌటుప్పల్, భూదాన్‌పోచంపల్లి మండల కేంద్రాల్లో కార్మికులు రాస్తారోకో చేశారు. రామన్నపేటలో వంటావార్పు చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో జీపీ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. కోదాడలో జీపీ కార్మికులు అర్ధనగ ప్రదర్శన తీశారు. ఆత్మకూర్‌ఎస్ మండల పరిధిలోని నెమ్మికల్ వద్ద సూర్యాపేట- దంతాలపల్లి ప్రధాన రహదారిపై సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం ఎస్‌ఐ వెంకట్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి కార్మికులకు సర్దిచెప్పారు. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో జీపీ కార్మికులు బస్టాండ్ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. మాడ్గులపల్లి మండలంలో జీపీ కార్మికులు దున్నపోతుకు వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.