సాగర్‌ రహదారిపై జీపీ కార్మికుల రాస్తారోకో

GP workers write on Sagar road– స్తంభించిన రవాణ వ్యవస్థ
– 33వ రోజుకు చేరిన జీపీ కార్మికుల సమ్మె
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామ పంచాయతీ కార్మికుల రోడ్డెక్కారు. నాగార్జున సాగర్‌ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. తమ సమస్యలు పరిష్కరించాలని నినదించారు. దాంతో జాతీయరహదారి స్తంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. గత 33 రోజులుగా చేస్తున్న సమ్మెకు ప్రభుత్వానికి పట్టడం లేదని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వానికి ఎందుకు చలనం లేదని కార్మికులు మండిపడ్డారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా నాయకులు బుగ్గరాములు, పోచమని కృష్ణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు 33 రోజులుగా సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలపై అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు చర్చించిన స్పందించకుండా ముఖ్యమంత్రి మొండితనం మార్చుకోవాలన్నారు. అనేక సంవత్సరాలుగా గ్రామాల్లో అతి తక్కువ వేతనంతో వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలన్నారు. మున్సిపల్‌ కార్మికులకు వర్తిస్తున్న 11వ పీఆర్సీ ప్రకారం వేతనాలు ఇవ్వాలన్నారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ, ఉద్యోగ భద్రత, వారంతపు సెలవులతో పాటు జాతీయ, అంతర్జాతీయ సెలవులు ఇవ్వాలన్నారు. తక్షణమే గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెను విరమించే విధంగా జేఏసీ నాయకులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో శాంతియుతంగా చేస్తున్న సమ్మెను ఉధృతం చేస్తామమన్నారు. ప్రగతి భవన్‌ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్‌ జిల్లా కోశాధికారి దేవదాస్‌, భాస్కర్‌, ఖాజాపాషా, రవి, జంగయ్య, శంకరయ్య, సురేష్‌ కిషన్‌, చంద్రయ్య, మల్లేష్‌, బుగ్గయ్య, సుశీల, పోచమ్మ, రాణమ్మ పాల్గొన్నారు.