గ్రామపంచాయతీ సిబ్బందిని పర్మినెంట్‌ చేయాలి

Gram Panchayat staff should be made permanent– వేతనాలను ప్రభుత్వ ట్రెజరీల ద్వారా చెల్లించాలు : మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-ముషీరాబాద్‌
గ్రామపంచాయతీ సిబ్బందిని వారి వేతనాల కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి, ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని, కార్మికులను పర్మినెంట్‌ చేయాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గ్రామపంచాయతీ ఉద్యోగులు కార్మికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం 32 రోజులుగా జరుగుతున్న రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు మద్దతుగా హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ, కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం పార్టీలు, ప్రజాసంఘాలు, సామాజిక సంస్థల ఆధ్వర్యంలో జేఏసీ చైర్మెన్‌ పాలడుగు భాస్కర్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పీఆర్‌సీలో నిర్ణయించిన మినిమం బేసిక్‌ రూ.19 వేలు వేతనంగా చెల్లించి జీవో నెంబర్‌.60 ప్రకారం స్వీపర్లకు రూ.15,000, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రిషన్లు, డ్రైవర్లు, కారోబార్‌ బిల్‌ కలెక్టర్‌కి రూ.19,500 వేతనాలు ఇవ్వాలన్నారు. కారోబార్‌ బిల్‌ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించి జీవో నెంబర్‌.51 సవరించాలన్నారు. మల్టీపర్పస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దుచేసి పాత కేటగిరీలన్నింటిని యథావిధిగా కొనసాగించాలని కోరారు. విధి నిర్వహణలో ప్రమాదం జరిగి మరణించిన సిబ్బంది కుటుంబానికి రూ.10లక్షల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేయాలని, దీని అమలును పోస్ట్‌ఆఫీస్‌ బీమాపథకం ద్వారా చెల్లించాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు ఆదాయం ఉన్న చోట వేతనాలు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వాలన్నారు. కార్యక్రమానికి కెేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్కైలాబ్‌ బాబు, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు జెవి చలపతిరావు, గోవర్ధన్‌ హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో జేఏసీ ప్రధాన కార్యదర్శి ఎన్‌.యజ్ఞనారాయణ, కన్వీనర్లు వెంకటరాజం, అరుణ్‌ కుమార్‌, శివ బాబు, ఎన్‌ దాస్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం.బాలమల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.