గుజరాత్‌కు అందని ‘గ్రామ్‌ స్వరాజ్‌’ నిధులు

– కేంద్రం దృష్టి నగరాల పైనే అంటున్న విమర్శకులు
అహ్మదాబాద్‌ : 2022-23 సంవత్సరంలో రాష్ట్రీయ గ్రామ్‌ స్వరాజ్‌ అభియాన్‌ (ఆర్‌జీఎస్‌ఏ) పథకం కింద గుజరాత్‌ రాష్ట్రానికి కేంద్రం నిధులు కేటాయించలేదు. అభివృద్ధి లక్ష్యాలను చేరుకునేందుకు వీలుగా గ్రామీణ స్వయం పాలనా సంస్థలకు ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. పథకానికి కేంద్రమే నిధులు అందజేస్తున్నప్పటికీ నిధుల వినియోగాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే పర్యవేక్షిస్తాయి. 2022-23లో ఈ పథకం కింద గుజరాత్‌కు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదులేవీ అందలేదని, అయినప్పటికీ గుజరాత్‌కు నిధులు విడుదల కాలేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల లోక్‌సభకు తెలిపింది. గుజరాత్‌కు ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదంటే ఆ రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం లేదని కేంద్రం భావిస్తోందని అర్థమవుతోందని, ఇది సరైన చర్య కాదని ఆర్థికవేత్త హేమంత్‌ కుమార్‌ షా తెలిపారు. ‘సర్పంచ్‌, ఇతర సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు ఆర్‌జీఎస్‌ఏ నిధులను ఖర్చు చేస్తారు. మరి శిక్షణే ఇవ్వనప్పుడు చట్టాల గురించి వారికి ఎలా తెలుస్తుంది? గుజరాత్‌లో 14 వేల గ్రామ పంచాయతీలు ఉంటే కేవలం 200 పంచాయతీలలో మాత్రమే గ్రామసభలు జరుపుతున్నారు. మిగిలిన చోట కేవలం అవి రికార్డులలో మాత్రమే కన్పిస్తున్నాయి’ అని చెప్పారు.
బీజేపీ ప్రభుత్వం కేవలం నగరాలపై మాత్రమే దృష్టి సారించిందని, 1995 తర్వాత గుజరాత్‌లో స్థానిక సంస్థలను పట్టించుకోవడమే మానేశారని ఐఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు నైషాద్‌ దేశారు విమర్శించారు. గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం ప్రధానంగా మున్సిపల్‌ కార్పొరేషన్లను విస్తరించడం పైనే శ్రద్ధ పెడుతోందని, ఇక సర్పంచ్‌లకు నిధులు ఎలా ఇస్తుందని ప్రభుత్వాధికారి ఒకరు ప్రశ్నించారు.