ఘనంగా తెలంగాణ రన్..

– పాల్గొన్న ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, డీఎస్పీ వెంకటేష్
నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రత్యేక తెలంగాణలో రక్షణా వ్యవస్థలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి అని, ప్రజల సంరక్షణే ధ్యేయంగా శాంతిభద్రతల పరిరక్షణకు అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు నిరంతరం పాటుపడుతున్నారని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అశ్వారావుపేటలో పోలీస్ పాలన శాఖ ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రన్ నిర్వహించారు. పట్టణంలోని స్థానిక మూడు రోడ్ల కూడలి నుంచి వ్యవసాయ కళాశాల వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర సాగిన ఈ పరుగును స్థానిక శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, వ్యవసాయ కళాశాల విద్యార్థులు, పలు వర్గాల ప్రజలు వందలాదిగా తరలి రాగా వారితో కలిసి ఎమ్మెల్యే కళాశాల వరకు పరుగు తీసారు. అనంతరం వ్యవసాయ కళాశాలలో పాల్వంచ డీఎస్పీ వెంకటేశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల రక్షణ కొరకు పోలీసులు నిరంతరం పాటుపడుతున్నారని, కరోనా సమయంలో అందరూ ఇళ్లలో ఉంటే పోలీసులు మాత్రమే వీధుల్లో ఉంటూ ప్రజల రక్షణకు పాటుపడ్డారని అన్నారు.ప్రజల సంరక్షణకు పోలీసులు పడుతున్న కృషి ఎనలేనిదన్నారు. కార్యక్రమంలో సీఐ బాలకృష్ణ, ఎస్.హెచ్.ఒ, ఎస్ఐ రాజేశ్ కుమార్, రవికుమార్, దమ్మపేట, అశ్వారావుపేట ఎంపీపీలు జల్లిపల్లి శ్రీరామ మూర్తి, సోయం ప్రసాద్, జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,తహసీల్దార్ లూదర్ విల్సన్, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఆబ్కారీ సీఐ నాగయ్య, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వర రావు, అశ్వారావుపేట మాజీ సర్పంచ్ కొక్కెరపాటి పుల్లయ్యతో పాటు రెండు మండలాల్లోని పలువురు ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పోలీస్ సిబ్బంది, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.