గ్రూప్‌- 1, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు

– టిఎస్‌పిఎస్సి నిర్ణయం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
టిఎస్‌పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో గతంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌, ఎఇఇ, డిఎవొ పరీక్షలు రద్దయ్యాయి. పేపర్‌ లీకేజీ వ్యవహారంలో సిట్‌ సమర్పించిన నివేదికను పరిశీలించిన కమిషన్‌ శుక్రవారం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌ 1 పరీక్షను తిరిగి జూన్‌ 11న నిర్వహిస్తామని టిఎస్‌పిఎస్సి చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి ప్రకటించారు.మిగిలిన రెండు పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. పోటీ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైన పరీక్షల నిర్వహణ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఇటువంటి గందరగోళ పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని, వాటికి కూడా కమిషన్‌ త్వరలో కొత్త తేదీలు ప్రకటిస్తుందని అధికార వర్గాల ద్వారా తెలిసింది.
సిట్‌ నివేదికలో కీలక అంశాలు
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో ప్రాథమిక నివేదికను సిట్‌ అధికారులు టిఎస్‌పిఎస్సికి అందజేశారు. సిట్‌ నివేదికలో అధికారులు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఈ నివేదిక అధారంగానే గతంలో నిర్వహించిన నాలుగు పరీక్షలను కమిషన్‌ రద్దు చేసింది. పేపర్‌ లీక్‌లో కీలక సూత్రధారి ప్రవీణ్‌తో సిస్టం అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ చేతులు కలిపాడని సిట్‌ పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే టిఎస్‌పిఎస్సీకి వచ్చిన రాజశేఖర్‌ పథకం ప్రకారమే ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు. రాజశేఖరే కంప్యూటర్‌ను హ్యాక్‌ చేసి పాస్‌వర్డ్‌ దొంగిలించాడని సిట్‌ తన నివేదికలో తెలిపింది.పెన్‌ డ్రైవ్‌ ద్వారా 5 పరీక్షా పత్రాలను రాజశేఖర్‌ కాపీ చేసి ప్రవీణ్‌కు ఇవ్వగా.. అతను ఎఇ ప్రశ్నపత్రాన్ని రేణుకకు విక్రయించాడు. గ్రూప్‌-1 ప్రశ్నపత్రం కూడా లీకైనట్టు గుర్తించామని సిట్‌ నివేదికలో స్పష్టంచేసింది.