స‌మూహం-సంస్కృతి-భిన్న‌త్వం

– కె.శాంతారావు, 9959745723
వేల ఏండ్ల సాంస్కృతిక చరిత్ర మనది. భిన్న ఆచారాలు, భాషలు, వేషధారణలు, ఆహార అలవాట్లు, కళలు, కట్టుబాట్లు, కులాలు, మతాల కలపోత మన దేశం. సమిష్టి జీవన విధానం మన లక్షణం. భిన్నత్వంలో ఏకత్వం మన ప్రత్యేకం. ఏ దేశానికి లేని ఈ చరిత్ర మన గర్వకారణం. దీన్ని కాపాడుకోవడం దేశ పౌరులుగా మన కర్తవ్యం. ‘భారత దేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహౌదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం’ అని అందరం ప్రతిజ్ఞ చేసి వచ్చిన వారమే. కానీ ప్రస్తుతం ఇది ఆచరణలో కొరవడుతోంది. పిన్నల నుండి పెద్దల వరకు అందరం ఒకే దారిలో పయనిస్తున్నాం. ఓ పక్క ఈ ఆధునిక సమాజంలో సాంకేతికంగా దినదినాభివృద్ధి చెందుతూ ఉన్నాం. మరోపక్క మన సంస్కృతికి పట్టుకొమ్మలుగా ఉన్న మానవీయ లక్షణాలను మాత్రం కోల్పోతున్నాం. తోటి మనుషులను, వారి జీవన విధానాన్ని అవహేళన చేస్తున్నాం. అజ్ఞానంతో మూఢ సంస్కృతిని ఆచరిస్తున్నాం. ప్రపంచీకరణ ప్రభావంతో వినిమయ సంస్కృతికి అలవాటు పడుతున్నాం. మనిషి తన సహజ లక్షణాన్ని, సంస్కృతిని కోల్పోతే సమాజ అభివృద్ధి కుంటుబడుతుందని చరిత్ర కారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి నేటి స్వార్థ రాజకీయ పరిస్థితులు ముఖ్య కారణంగా ఉన్నాయి. నేడు ‘ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం’ సందర్భంగా మన దేశ సంస్కృతి, దాని చరిత్ర గురించి ఈ వారం కవర్‌స్టోరీలో తెలుసుకుందాం.
అనంతమైన విశ్వంలో అందమైన ప్రకృతి. ప్రకృతి గల పుడమి బడిలో మానవ జీవనం. సుమారు 150 కోట్ల సంవత్సరాల నాడు ఈ భూమిపై జీవపదార్థం పుట్టింది. ఈ పదార్థం పరిణామం చెందుట వలనే గత 50 కోట్ల సంవత్సరాల నుండి క్రమంగా వివిధ రకాల వృక్షాలు, జంతువులు, పక్షులు, ప్రాణకోటి పుట్టుకొచ్చాయి.
పది లక్షల సంవత్సరాల నాడు కోతులు పుట్టాయి. 5 లక్షల సంవత్సరాల నాడు వానర రూపం పోలిన ఆదిమానవుడు ఉద్భవించాడు. గత 50 వేల సంవత్సరాల నుండే ఆధునిక మానవ జాతి ఆవిర్భవించిందని పురాతత్వ శాస్త్రజ్ఞుల అంచనా.
క్రీ.పూ. పదివేల సంవత్సరాల నుండి అంటే కొత్త రాతియుగం నుండి మానవజాతి వికాసం ప్రారంభమైంది. అప్పటి నుండి మనిషి రాతి పనిముట్లను వాడాడు. సొంత ఆవాసాలను నిర్మించుకున్నాడు. జంతు చర్మాలను ధరించాడు. అప్పటి ప్రపంచ జనాభా కేవలం పదిలక్షలు మాత్రమేనట.
క్రీ.పూ. 6 వేల సంవత్సరాల నాడు వ్యవసాయ రంగం ఏర్పడింది. వేట, సంచారం నుండి స్థిరనివాసం ఏర్పరచుకున్నాడు మానవుడు. అప్పటి జనాభా కేవలం కోటి మాత్రమే.
క్రీ.పూ. 5 వేల సంవత్సరాల తర్వాత క్రమంగా రాజ్యాలు, వివిధ వృత్తులు ఏర్పడ్డాయి. మానవునికి లభించిన మహత్తర విజ్ఞానంలో సింహభాగం అంతా గత ఏడు వేల సంవత్సరాల కాలం నుండే లభించింది.
అందుకే మహాకవి శ్రీశ్రీ దేశచరిత్రల కవితలో నైలునదీ నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది? అని ప్రశ్నించాడు. ‘తక్షశిల, పాటలీపుత్రం.. మధ్యధరాసముద్రం, హరప్పా, మొహంజదారో, క్రొమాన్యన్‌ గుహ ముఖాల్లో..’
చారిత్రక విభాత సంధ్యల మానవకథ వికాసమెట్టిది? ఏ దేశం ఏ కాలంలో సాధించినదీ పరమార్థం? శోధించమంటాడు.
మానవ కథ వికాసం అంటే మానవ జాతి సాంస్కృతిక వికాసం అని చెప్పకనే చెప్పినట్లయింది. ఆధునిక మానవ సమాజపు పరిణామంలో… శాస్త్ర సాంకేతిక విలువలతో భౌతిక నాగరికత దినదిన ప్రవర్ధమానం అవుతుంటే, సాంస్కృతిక వికాసం క్షణక్షణం క్షీణిస్తున్నదని సామాజిక సాంస్కృతిక వేత్తలు ఆందోళన పడుతున్నారు నేడు.
‘ఓ జాతి ఔన్నత్యం ఆ జాతి ప్రతిబింబించే సాంస్కృతిక రంగంపై ఆధారపడి వుంటుందని గురుదేవ్‌ రవీంద్రనాథ్‌ టాగూర్‌ అంటాడు.
సంస్కృతిలో భాష, భావధార (ఆలోచనలు), నడవడిక (ప్రవర్తన), ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, కళలు – సాహిత్యం అన్నీ కలగలిసి వుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సమిష్టి జీవన విధానం.
అంటే కవి బాలగంగాధర్‌ తిలక్‌ చెప్పినట్లు భాషా సంస్కృతులు మార్పులేని స్థిరబిందువులు కావు. విజ్ఞానాన్ని లోకజ్ఞానాన్ని ఆకళించుకున్న అంత:సింధువు. సంస్కృతి సముద్రం కన్నా లోతైనది. విశాలమైనది. స్థల కాలాదులకు ఇది లోబడి వుంటుంది. సంస్కృతి అంటే ఓ జాతి/ తెగ/ సమూహం యొక్క ఉమ్మడి జీవన విధానం. ఇది తరతరానికి, ప్రాంతం ప్రాంతానికి మారుతూనే వుంటుంది. మార్పు నిరంతరం.
పాతది అంతా గొప్ప కాదు. కొత్తది అంతా తప్పు కాదు. మహాకవి గురజాడ చెప్పినట్లు పాత కొత్తల మేలు కలయికగా సంస్కృతి ఓ జీవనదిలా ప్రవహిస్తుంది.
ఆహార, ఆచార వ్యవహారాల్లో అలవాట్లు, కట్టుబాట్లల్లో, పనిపాటల్లో మెరుగైన జీవన సౌకర్యాల కోసం ఆ తెగ (కమ్యూనిటీ) కాలంతో పాటు నిరంతరం ఘర్షణ పడుతుంది. స్వీకరించేవి స్వీకరిస్తుంది. అట్టిపెట్టుకునేవి అట్టిపెట్టుకుంటుంది. తిరస్కరించేవి తిరస్కరిస్తుంది. ఇదో సాంస్కృతిక పరిణామం. భాష, సంస్కృతికి ప్రాణవాయువు అనే విషయం సదా గమనంలో వుండాలి సుమా!
ఓ నిర్దిష్ట సమాజ సంస్కృతిని స్థూలంగా చూడడం వేరు సూక్ష్మంగా చూడటం వేరు.
మానవజాతి సంస్కృతిని స్థూలంగా చూసినప్పుడు మానవజాతి స్వాభావిక లక్షణాల గురించి కొంత తెలుసుకోవాలి. ఆదిమానవుని కాలం నుండి గమనించినప్పుడు ముఖ్యంగా మూడు లక్షణాలు గోచరిస్తాయి.
1. మనిషిని మనిషిగా పట్టించుకోవడం (కేరింగ్‌). సాటి మనిషిని మనిషిగా చూడటం. గుర్తించడం, గౌరవించడం, సహకరించడం ప్రాథమిక మానవీయ లక్షణంగా ఆధునిక సమాజం చెబుతున్నది.
ఆఫ్రికా అడవుల్లో ఆదివాసి, తమ అరణ్య ప్రాంతంలోకి కొత్త వ్యక్తి వచ్చినప్పుడు, అతని వద్దకు పరుగున వచ్చి ‘ఉబంటూ’ అంటాడు. దాని అర్ధం నీవు భయపడకు. నీ కోసం నేనున్నాని చెప్పడం. ఇదో ఉత్తమ మానవ లక్షణంగా ఐక్యరాజ్య సమితి కూడా పేర్కొన్నది. మనం సాధారణంగా పరిచయస్థులు ఎదురైతే చిరునవ్వుతో ‘బాగున్నారా’ అని పలుకరిస్తాం. ‘ఉబంటూ’ అటువంటి పలకరింపే అయినా అందులో ఎంత గొప్ప నిగూఢార్థం వుందో తెలిసినప్పుడు ఆశ్చర్యపోతాం.
2. మనిషి తోటి మనిషితో సుఖదు:ఖాలు పంచుకోవడం (షేరింగ్‌) – ఆదిమానవుల కుడ్య చిత్రాలు ఇదే విషయాన్ని తెలుపుతాయి. జంతువును ఎలా వేటాడింది, ఆ వేటలో గాయపడితే ఎలా దు:ఖం వచ్చింది, విజయమొస్తే ఎంతగా సంతోషించింది ఆ చిత్రాలు ఇప్పటికీ చూపుతూనే వున్నాయి. కళలు – సాహిత్యం ఆ విధంగానే పుట్టాయి. ఆ పనే చేస్తుంటాయి.
3. పిల్లలను, అంటే భావితరాలను పెంచడం, పెంపకం (రేరింగ్‌) – మనిషి తన అనుభవం ద్వారా, ఇంద్రియాల ద్వారా తెలుసుకున్న జ్ఞానాన్ని పిల్లలకు అందించేందుకు స్వాభావికంగానే తాపత్రయపడటం.
ఈ మూడు మానవీయ లక్షణాలు మానవ జీవన సంస్కృతికి పట్టుకొమ్మలుగా నిలుస్తున్నట్టు సామాజిక చరిత్రకారులు వ్యాఖ్యానిస్తున్నారు. సుస్థిర అభివృద్ధికి పునాదిగా నిలుస్తున్నాయని చెబుతున్నారు.
అయితే ఈ విశ్వమానవీయ సంస్కృతికి రెండు ప్రమాదాలు పొంచి వున్నాయి. 1. ఫ్యూడల్‌ సమాజంలోని అజ్ఞాన మూఢత్వ సంస్కృతి, 2 పెట్టుబడిదారీ సమాజంలోని పరాయీకరణ (ఎవియనేషన్‌) సంస్కృతి.
పూర్వం నుండి మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి నిరంతరం ఘర్షణ పడుతూనే వున్నాడు. ఆ ఘర్షణ నుండే ఆలోచన అభివృద్ధి అయింది. వానరుడు నరుడు అయ్యాడు. ముందలి పాదాలు చేతులుగా మారడమే గాక, నాలుగు వేళ్ళకు అభిముఖంగా బొటనవేలు ఏర్పడింది. మరే జంతువులకు ఇలా లేదు. చేతుల్లో పట్టు వచ్చింది. పనిముట్లను సృష్టించుకున్నాడు. అప్పటి నుండి ఎంతో విజ్ఞానాన్ని సాధించాడు. చీకటి ఖండాలను వెలుతురు ఖండాలుగా మార్చాడు. సృష్టికి ప్రతి సృష్టి చేస్తున్నాడు. చనిపోయినవాని కన్ను, కాలేయం, కిడ్నీ, చివరకు గుండె కూడా అమర్చి పునర్జన్మ ఇస్తున్నాడు. ఇదంతా మనిషి సైన్స్‌తో సాధించిన విజయం. అయితే భావవాదులు దీనిని అంగీకరించరు. సైన్స్‌ సాధించిన ఫలితాలు ఒక పక్క అనుభవిస్తూనే మూఢత్వానికి బానిసలవుతారు. ఛాందసత్వానికి రాచబాట వేయడానికి మూర్ఖంగా పూనుకుంటారు. ఈ విశ్వం, ప్రపంచం నడిపే అతీంద్రియ శక్తి ఏదో ఉందని (ఒక దైవం) భావిస్తారు. లేని నిరూపణకు రాని ఆ శక్తిని ఊహించుకుని మతాల్లో బంధిస్తారు. మత మారణహోమాలకు తెరదీస్తారు. మానవత్వాన్ని బలిపెడతారు.
పైగా ఇంద్రియాల ద్వారా లభించే జ్ఞానం జ్ఞానమే కాదని, దైవాన్ని తెలుసుకునే మోక్ష జ్ఞానమే సరైన జ్ఞానమని వాదిస్తారు. ఈ ప్రపంచం వాస్తవం కాదని, అంతా మిద్యే అంటూ యజ్ఞ, యాగాదులు, పూజలు, క్రతువులు చేస్తారు. కొందరు అజ్ఞానంతోనూ, మరి కొందరు విజ్ఞానాన్ని కాదంటూ ఈ మిద్యా (భావం)వాదానికి మత సంస్కృతితో ప్రాణ ప్రతిష్ట చేస్తారు. అందుకే శ్రీశ్రీ ఇలా అడుగుతాడు…
”మాయంటావు? లోకం మిద్యంటావూ?/ కనపడనిది కనపడదని, వినపడినది వినపడదని… మహారాజు, మనీపర్సు మాయంటావు మరఫిరంగి మాయంటావు…?
దేవుని పేరిట, మతం పేరిట సాగించిన అకృత్యాలను ఇలా ప్రశ్నిస్తూనే వుంటాడు. ఇప్పుడే కాదు, వేద కాలం నుండి సత్యశోధకులు, చార్వాకులు ఇలా అజ్ఞానాన్ని, మూఢత్వాన్ని ప్రశ్నించినవారే. ఈ ప్రశ్నించే హేతువాద సంస్కృతే, కారణాలను శోధించే సంస్కృతే మానవ విజ్ఞానానికి నిజమైన రాచబాటలు వేస్తాయని మరువరాదు.
మానవునిలో చెలరేగే తాత్విక చింతనకు, సంస్కృతికి విడదీయలేని సంబంధం ఉన్నదనే విషయాన్ని గమనించాలి.
ఫ్యూడల్‌ సంస్కృతిలో జాతి, వర్ణ వివక్ష, పురుషాధిక్యత, సాటి మనిషిని మనిషిగా చూడక నిరాకరించడం, బానిసగా, వెట్టివానిగా చూస్తూ అంతరాల్ని పాటించడం; ఆ అంతరాలు శాశ్వతంగా ఉండాలని తలపోస్తూ కర్మ సిద్ధాంతాలను, పూర్వజన్మ సిద్ధాంతాలను ముందు పెట్టడం; తమ పాలనను సుస్థిరం చేసుకోవాలనే తలంపుతో విద్వేషాలను రెచ్చగొట్టడం; యుద్ధాలు మారణ హోమాలు సృష్టించడం యుగయుగాల నుండి ఇప్పటికీ కొనసాగుతూనే వున్నది. ఫాసిస్టు ప్రమాదమై దాష్టిక అణచివేతకు పూనుకుంటూనే ఉన్నది. బడుగులకు, స్త్రీలకు, మైనార్టీలకు ప్రాణాంతకమౌతున్నది.
మరో పక్క ప్రపంచీకరణ నేపధ్యంలో పెట్టుబడిదారీ సంస్కృతి తొండముదిరి ఊసరవెల్లి అయినట్లు మనిషిని భయంకరంగా పరాయీకరణ గావిస్తున్నది. ప్రకృతి నుండి, శ్రమ నుండి, సమాజం నుండి, కుటుంబం నుండి, చివరకు తన నుండి తానే వేరైపోతున్నాడు. ఎందుకు పుట్టామో, ఎందుకు పెరిగామో, ఎందుకు జీవిస్తున్నామో, తెలుసుకోక యంత్రంగా మారి గందరగోళంగా, కంగారు కంగారుగా బతుకుతున్నాడు.
లాభం వస్తుందంటే చాలు పెట్టుబడిదారుడు శవపేటికలు, ఉరితాళ్ళను కూడా ఉత్పత్తి చేస్తాడు అని మార్క్స్‌ ఏనాడో చెప్పాడు కదా. అంటే ఈ వ్యవస్థలో మనిషి ప్రాణానికి, జీవితానికి, మానవత్వానికి చోటేలేని దోపిడీ సంస్కృతి ఎల్లెడలా అలుముకుని వుంటుంది.
సర్వం సరుకుమయంలో మనిషి కూడా ఓ మార్కెట్‌ సరుకేగా మరి. మనుషులతో శ్రమజీవులతో గొడవలెందుకని కృత్రిమ మేధస్సుతో (ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఎ.ఐ) రోబోలు సృష్టించుకున్నాడు. మరోపక్క అంతర్జాలంలో పోర్న్‌ కల్చర్‌కి (బూతు చిత్రాల సంస్కృతి) తెరి తీసి, జంతువులాగా లైంగిక విశృంఖలత్వానికి మనిషిని అలవాటు చేస్తున్నాడు. యంత్రంలాగా మారిపో లేదా జంతువులాగా దిగజారిపో అన్నది పెట్టుబడి దారీ సంస్కృతి నినాదమైంది. మత్తు, మాదక ద్రవ్యాలు ఎలానూ ఎక్కడ బడితే అక్కడ పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్నాయి. ఈ విష సంస్కృతికి యువతను బలి తీసుకుంటున్న వైనం కాదనగలమా?
ఇలాంటి నేపథ్యంలో మనం జీవిస్తున్నాం. ఆహారం, సంపద, ఆ తెగ/ సమూహం యొక్క ఉమ్మడి ఆస్తి (వ్యక్తిగతమైన సొంత ప్రైవేటు ఆస్తిలేని) గల ఆదిమ కమ్యూనిస్టు సమాజ సంస్కృతి నుండి మానవ సమాజం విభిన్న పరిణామ దశలను దాటుకుని నేడు ఈ స్థితికి వచ్చింది.
ఫ్యూడల్‌ పెట్టుబడి దారీ సంస్కృతి లక్షణాలతో పాటు వాటిని ప్రతిఘటించే శాస్త్రీయ, అభ్యుదయ సంస్కృతి కూడా అనివార్యంగా ముందుకొస్తూనే వుంటుంది. మనిషితనం లేదా మానవీయ కోణమే ఈ మానవాభ్యుదయ సంస్కృతికి భూమికగా వుంటుంది.
భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని అంగీకరించే విశాలత్వం ఈ సంస్కృతిలో ఇమిడి వుంటుంది. లివ్‌ అండ్‌ లెట్‌ లివ్‌ – జీవించు, ఇతరులు (పరిసరాలు, ప్రాణులతో సహా) జీవించేలా సహకరించు అనేది ఆధునిక ప్రజాస్వామ్య సాంస్కృతిక నినాదమైంది.
సాంస్కృతిక రంగంలో చేతనాపూర్వకంగా పనిచేయడం అంటే సమాజానికి ఉత్ప్రేరకంలా పనిచేయడమే అవుతుంది. ఆధిపత్య మూస సంస్కృతిని బలవంతంగా రుద్దడమంటే బలహీనుల హక్కులను కొల్లగొట్టడమే అవుతుంది.
ప్రజల భాగస్వామ్యం వహించే ప్రత్యాధిపత్య సంస్కృతిని సృష్టించి వ్యాపింపజేయడానికి భావవిప్లవం తప్పదు.
ప్రజా సంస్కృతిని గౌరవించడం అంటే ముందు ప్రజల్లోని ఆ భిన్నత్వాన్ని గౌరవించడం అని అర్థం చేసుకోవాలి. అందుకే ప్రపంచంలోని ఏ మూలన దైన్యంలో వున్న బాధితులంతా వారు అన్నార్తులు, శరణార్ధులు, స్త్రీలు, మైనార్టీలు, దళితులు, ఆదివాసులు, బాలకార్మికులు, ఎవరైనా కావచ్చు, మూగ బాధతో ఘోషించేది ఒక్కటే. మమ్మల్ని ఉద్దరించాలని అనుకునే ముందు మమ్మల్ని గౌరవించమని, సాటి మనుషులుగా తమని గుర్తించమని పాలకులను, నేతలను అడుగుతున్నారు. డిమాండ్‌ చేస్తున్నారు. స్వాభిమానంతో ముందుకు నడవాలని కోరుకుంటున్నారు. మానవ హక్కుల సంస్కృతి అంటే ఇదే కదా.
శాంతి, సమభావం, సమిష్టి క్షేమం, ఆధునిక మానవ జీవన శైలి లక్షణంగా (సాంస్కృతిక లక్షణంగా) శ్రీశ్రీ గుర్తించాడు కనుకనే మానవుడే నా సందేశం. మనుష్యుడే నా సంగీతం అని ఎలుగెత్తి చాటాడు.
ఫాసిస్టు ప్రమాద సంస్కృతిని లేదా పెట్టుబడిదారీ దోపిడీ సంస్కృతిని ప్రతిఘటించి మానవీయ ప్రజా సంస్కృతి నిర్మించాలంటే నిత్యం ప్రజల్లో కలిసి పనిచేయాల్సిందే. ఆ ప్రజల్లోని భిన్నత్వాన్ని, బహుళత్వాన్ని గౌరవించాల్సిందే. ‘భిన్నత్వంలో ఏకత్వమే’ మన భారతీయ సంస్కృతి అని చాటిచెప్పాల్సిందే అదే సత్యం, అదే నిత్యం.