గ్యారెంటీ పనిదినాలు 200కు పెంచాలి

– కనీస వేతనం రోజుకు రూ.600 ఇవ్వాలి
– గ్రామీణాభివృద్ధి, రైల్వే శాఖ మంత్రులకు వ్యవసాయ కార్మిక సంఘాల వినతి
న్యూఢిల్లీ : గ్యారెంటీ పనిదినాలు ఏటా 200కు పెంచాలని, కనీస వేతనం రోజుకు రూ.600గా నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తూ అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం (ఏఐఏడబ్ల్యూయూ) సహా ఐదు వ్యవసాయ కార్మిక సంఘాలు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు వినతిపత్రం సమర్పించాయి. ఒరిస్సా రైలు విపత్తు నేపథ్యంలో, కోవిడ్‌ -19 మహమ్మారి సమయంలో రద్దు చేయబడిన ప్యాసింజర్‌ రైళ్లను పునరుద్ధరించాలని, మరిన్ని జనరల్‌ బోగీలను అనుమతించాలని డిమాండ్‌ చేస్తూ సంస్థలు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు వినతిపత్రం సమర్పించాయి.
అనంతరం ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఏఐఏడబ్ల్యూయూ సహాయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.శివదాసన్‌ మాట్లాడుతూ వినతిపత్రంలోని డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే దేశవ్యాప్త ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ‘ఉపాధి హామీ పథకం కేటాయింపుల్లో కోత విధిస్తూ కేంద్రం పూర్తిగా విస్మరిస్తోంది. పథకం అమలు చేసి కులాల వారీగా నిధులు కేటాయించాలనే ఎత్తుగడను ఉపసంహరించుకోవాలి. ఆన్‌లైన్‌ హాజరు నమోదు. ఆధార్‌ లింక్డ్‌ సిస్టమ్‌ తో మాత్రమే వేతనాల చెల్లింపును ఉపసంహరించుకోవాలి. కార్మికులకు పెన్షన్‌ భరోసా, పని ప్రదేశాల్లో మౌలిక వసతులు కల్పించడం వంటి వాటిని త్వరగా అమలు చేయాలి. ఉపాధి హామీ పథకానికి రూ.2.56 లక్షల కోట్లు కేటాయించాలి’ అని డిమాండ్‌ చేశారు. ఒరిస్సా రైలు ప్రమాదంలో మరణించిన జనరల్‌ బోగీల్లో ఎక్కువ మంది బీహార్‌, బెంగాల్‌, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కూలీలు బోగీల్లో ఎక్కువ మంది ఉన్నారన్నారు. ధనికుల విలాసవంతమైన ప్రయాణానికి వందేభారత్‌ మొదలైన వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా కార్మికులు, ఇతరులపై ఎక్కువగా ఆధారపడే జనరల్‌ బోగీల సంఖ్యను పెంచాలని అన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో పలు ప్యాసింజర్‌ రైళ్లను రైల్వేశాఖ నిలిపివేసిందని, దీంతో రైళ్లలో తీవ్ర రద్దీ నెలకొందని అన్నారు. రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఒరిస్సా దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి రైల్వేలో ఉద్యోగం కల్పించాలని శివదాసన్‌ డిమాండ్‌ చేశారు. ఇతర వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు రాధికా మీనన్‌, విఎస్‌ నిర్మల్‌, విక్రమ్‌ సింగ్‌ తదితరులు మాట్లాడారు.