వెలవెలబోయిన ‘ఉపాధి హామీ’ ప్రజా వేదిక

– ఓపెన్‌ ఫోరంకు హాజరుకాని ప్రజలు
– పడిపోయిన సామాజిక తనిఖీ ప్రమాణాలు
– తనిఖీపై ఆసక్తి చూపని కూలీలు
నవతెలంగాణ-శాయంపేట
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలులో భాగంగా నిర్వహించిన సామాజిక తనిఖీ ప్రజావేదిక జనం లేక వెలవెలబోయింది. చట్టం సక్రమంగా కొనసాగేందుకు, కూలీల సమస్యలు పరిష్కరించేందుకు, అవినీతి, అక్రమాలను అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సామాజిక తనిఖీ కార్యక్రమం చేపడుతోంది. సామాజిక తనిఖీ బృందాల ప్రమాణాలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో కూలీలు ఆసక్తి చూపడం లేదు. సామాజిక తనిఖీ బృందం దృష్టికి తీసుకెళ్తే తమ సమస్యలు పరిష్కరించబడతాయనే విశ్వాసం ఉపాధి కూలీల్లో రోజురోజుకూ సన్నగిల్లిపోతుంది. వరంగల్‌ జిల్లా శాయంపేట మండల పరిధిలోని 24 గ్రామ పంచాయతీలలో 2021 ఫిబ్రవరి 1 నుంచి 2023 మార్చి 31 వరకు జరిగిన ఉపాధి హామీ పనుల్లో రూ.6,61,13,756 నిధుల ఖర్చుపై 14వ విడత సామాజిక తనిఖీ బృందం సభ్యులు ఈనెల 4 నుంచి 18 వరకు గ్రామాల్లో తనిఖీలు చేపట్టి సోమవారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక నిర్వహించారు.
ఈ ఓపెన్‌ ఫోరం కార్యక్రమానికి సామాజిక తనిఖీ బృందం, ఉపాధి హామీ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు మాత్రమే హాజరయ్యారు. ప్రజలు, కూలీలు ఎవరూ పాల్గొనలేదు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు హరిత దినోత్సవ వేడుకలలో పాల్గొనడంతో ఈ ప్రజావేదికకు హాజరు కాలేదు. దీంతో ప్రజావేదిక ప్రజలు లేక వెలవెలబోయింది. సామాజిక తనిఖీ బృందం కూడా తమ స్థాయికి తగ్గట్టుగా తనిఖీ నిర్వహించకపోవడమే ముఖ్య కారణమని ప్రజలు చర్చించుకోవడం గమనార్హం. ఉపాధి హామీ చట్టంపై వార్డు సభలు, గ్రామసభల ద్వారా సామాజిక తనిఖీ సభ్యులు కూలీలకు అవగాహన కల్పించాలి.