– బోధనేతర పనులతో అవస్థలు
– మానసిక ఒత్తిడి, పనిభారంతో తిప్పలు
– సక్సెస్‌లో వారి పాత్ర వీడదీయలేనిది
– బాధల్ని పట్టించుకోని సర్కార్
– సమస్యల పరిష్కారంకోసం రేపు హైదరాబాద్‌లో మహాధర్నా
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
గురుకుల పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను సమస్యలు వెంటాడుతున్నాయి. వీరిని ఉపాధ్యాయులు అనడం కంటే మల్టీపర్పస్ వర్కర్లు అనడం సముచితంగా ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేలాది మంది విద్యార్థులు ఉండే ఆ పాఠశాలల్లో ఉపాధ్యాయులే వార్డెన్ విధులనుంచి మొదలుకుని హౌజ్ మాస్టర్, కేర్ టేకర్, డిప్యూటీ వార్డెన్, సూపర్వైజరీ స్టడీస్, నైట్ స్టే, ఎస్కార్ట్ తదితర బోలెడు పనులు చేయాల్సి వస్తున్నది. నిరంతరం కంటికి రెప్పలా విద్యార్థులను వారు కాపాడుకుంటున్నారు. సెలవు రోజుల్లో సైతం కొంత మంది ఉపాధ్యాయులు పనిచేయాల్సి వస్తున్నది. వీటికి తోడు రోజూ పాఠశాలకు కాపలా కాసే పనికూడా చేయాల్సి వస్తున్నది. అంతే కాదు..మహిళా ఉపాధ్యాయులకు సైతం ఈ పని తప్పడం లేదంటే ..వారి పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కష్టానికి తగిన గుర్తింపేది?
గురుకుల ఉపాధ్యాయుల కష్టానికి తగిన గుర్తింపు దక్కడం లేదు. పైగా వారిపై పనిభారం ఎక్కువ. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. అధికారుల వేధింపులతో మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఆయా విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యకు అంకిత భావంతో కృషి కొనసాగిస్తున్నారు. గురుకులాల్లో విద్యా ర్థులు సాధించిన విజయాలను ఈ నేపథ్యంలోంచే చూడాలి. కానీ.. విద్యార్థుల సక్సెస్‌కు మూలమైన ఉపాధ్యాయుల బాధలు పట్టించుకునేందుకు సర్కారుకు మనసు రావటం లేదు. వారి సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తు న్నది. వేతనంలో వివక్షను కొనసాగిస్తున్నది. తగిన సౌకర్యాలు కల్పించటం లేదు.
ఒత్తిడి లేని పనితోనే ఫలితాలు ..
ఉపాధ్యాయులు విధి నిర్వహణలో ఒత్తిడి లేకుండా ఉంటేనే..ఫలితాలు వస్తాయి. ఇందుకు స్వేచ్చగా బోధించే వాతావరణాన్ని ప్రభుత్వం కల్పించాలి. అప్పుడే విద్యార్థుల మానసిక స్థితికి తగిన విధంగా విద్యను అందించటం సాధ్య మవుతుంది. సవాలక్ష సమస్యలు బోధించే ఉపాధ్యాయులనే వెంటాడుతుంటే..ఇక విద్యార్థులకు నాణ్యమైన చదువును ఎలా చెబుతారు? మరో పక్క ఆయా గురు కులాల్లో విద్యార్థులనూ పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. ఉపాధ్యాయు ల, విద్యార్థుల, వసతి గృహాల సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం మీన మేషాలు లెక్కించట మేంటని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. సమస్యలు పరిష్కరించకపోగా విధి నిర్వహణలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారంటూ అధికారుల వేధింపులు ఎక్కువవతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏకరూపత లేక ఇబ్బందులు..
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత పది జిల్లాల్లో అన్ని యాజమాన్యాలలో కలిపి కేవలం 298 గురుకుల విద్యాసంస్థలు మాత్రమే ఉండేవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీ టు పీజీ పథకంలో భాగంగా ప్రభుత్వం ఒకేసారి 700 పైగా గురుకుల విద్యాసంస్థలు ఏర్పాటు చేసింది. దీంతో రాష్ట్రంలో రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలతో సహా మొత్తం 1002 గురుకుల విద్యాసంస్థలు ఉన్నాయి. ఒక్కో సొసైటీలో ఒక్కో రకంగా పరిపాలన, అజమాయిషీ కొనసాగుతున్నది. బోధనా సమయాల్లో సైతం ఏకరూపత లేదు. దీంతో అనేక సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. కొత్త విద్యా సంస్థలు అన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. రెగ్యులర్ ఉపాధ్యాయులతో పాటు సమాన సంఖ్యలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం టీచర్లు పనిచేస్తున్నారు. వారికి కనీస వేతనాలు లభించటం లేదు. 2018, 2019 సంవత్సరాల్లో నియామకమైన రెగ్యులర్ టీచర్ల సర్వీసు రెగ్యులరైజేషన్స్ పూర్తి చేయడంలో, ప్రమోషన్లు ఇవ్వటంలో ఒక్కో సొసైటీ ఒక్కో రకంగా వ్యవహరిస్తున్నది.
సర్కారు స్పందించాలి :చావ రవి,ప్రధాన కార్యదర్శి టీఎస్‌యూటీఎఫ్
గురుకుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం గత ఐదేండ్లుగా టీఎస్ యూటీఎఫ్ నిరంతరం కృషి చేస్తున్నది. వారి సమస్యలు పరిష్కారించాలని ప్రభుత్వానికి పలు సార్లు విన్నపాలు అందజేసింది. ఈ క్రమంలో కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ ఇంకా పలు ముఖ్య మైన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి.వాటి పరి ష్కారం కోసం ఈ నెల ఐదున హైదరాబాద్‌లో మహాధర్నా నిర్వహిస్తున్నాం. ఇప్పటికైనా సర్కారు స్పందించాలి. గురువుల బాధలు పట్టించుకోవాలి. సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి.