ప్రయివేట్ తో గురుకుల విద్య పోటీ

నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రయివేట్ విద్యతో ప్రభుత్వ గురుకుల విద్య పోటీ పడుతుందని, నిరుపేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసిందని ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి స్పష్టం చేశారు.  స్థానిక మైనార్జ్ బాలికల జూనియర్ కళాశాలలో బుధవారం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినీలను ఆయన సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్కో విద్యార్థిపై రాష్ట్ర ప్రభుత్వం రూ.1.25 లక్షలు వెచ్చిస్తుందని,దానికి అనుగుణంగా ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని సూచించారు. బంగారు భవిష్యతకు గురుకులాల ద్వారా బాటలు వేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు. కళాశాలలో ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకొస్తే ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు సహాకారంతో తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం నూరు శాతం ఫలితాలు సాదించటంలో కీలక పాత్ర పోషించిన కళాశాల అధ్యాపకులను అభినందించారు. కార్యక్రమంలో మైనార్టీ కళాశాల ప్రగతి సాదించటానికి సహకరిస్తున్న ఎంపీపీని అధ్యాపకులు,విద్యార్థినీలు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శారా లిల్లీ, బీఆర్ఎస్ నాయకులు మందపాటి రాజ మోహన్ రెడ్డి, సత్యవరపు సంపూర్ణ, సతీష్ రెడ్డి, అద్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.