విదేశీ వస్త్ర ప్రపంచంలో చేనేత ఢంకా

అది ప్యారిస్‌లో ఓ హ్యాండ్‌లూమ్‌ ఎగ్జిబిషన్‌. ఒక అమ్మాయి వస్త్రాలను చూసి మంత్ర ముగ్దురాలయ్యింది. ఆ వస్త్ర ప్రేమికురాలు ఉద్వేగానికి లోనవుతూ ‘ఒక్కసారి వీటిని తాకవచ్చా’ అంటూ వినమ్రంగా అడిగింది. ”ఓహ్‌! తాకవచ్చు. అంతేకాదు కొనుక్కొని కట్టుకోవచ్చు కూడా!’ అన్నది షాపు(స్టాల్‌) ఓనర్‌. ఆ అమ్మాయి వస్త్రాన్ని తడిమిచూసి ఏడ్చేసింది. ఎందుకని అడిగితే ‘మజ్లిన్‌ (మల్‌ మల్‌) చేనేత గొప్పతనం గూర్చి పుస్తకాల్లో చదవడమే కానీ, ఇలా ప్రత్యక్షంగా చూసింది లేదు. చూడాలన్న కోరిక ఉన్నా ఇంతవరకు నెరవేరనేలేదు. ఇప్పుడు ఈ వస్త్రాల మృదుత్వాన్ని చూస్తుంటే ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతు న్నాయి’ అని చెప్పింది. ఒక కళా కారిణికి ఇంతకన్నా తృప్తి ఇంకే ముంటుంది? అంటున్నారు LabelRama సంస్థ వ్యవస్థా పకురాలు రాజేశ్వరి రామా. అసలు ఈ సంస్థ ఏమిటో? దీని ప్రత్యేకత ఏమిటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.
చేనేత ఒక కళాత్మక ప్రక్రియ… చేనేత ఒక సృజనాత్మక క్రియ… దారాల దూరాలను దగ్గరచేస్తూ పోగుపోగులో వర్ణజీవం పోస్తూ… మృదుత్వంతో అనుకూలంగా ఉంటూ దేహాలను అలంకరిస్తూ అందాన్ని ఇనుమడింపజేసే అద్భుత సృష్టే చేనేత. ఇది భారతదేశంలో అతి ప్రాచీనమైన ప్రక్రియ. వందల ఏండ్ల కిందట విదేశీ మారకద్రవ్యాన్ని సంపాదించిన ఘనత మన చేనేతది. శాతవాహనుల కాలంలో ఇక్కడి వస్త్రాలు యూరప్‌కు ఎగుమతి చేసేవారు. కానీ ప్రస్తుతం చేనేత పరిశ్రమకు అంతగా గుర్తింపు, ప్రగతి కనిపించడం లేదు. చేనేత చాలా శ్రమతో కూడుకున్న పని. మనం ధరించే దుస్తుల్లో ఫ్యాషన్‌తో పాటు అనుకూలత కూడా ఉండాలి అనే ఉద్దేశంతో చేనేత ప్రాచుర్యానికి పూనుకున్నారు రాజేశ్వరి రామా.
వస్త్రాలపై అభిరుచి పెరిగింది
మాది వైజాగ్‌. నాన్న టెక్స్‌ టైల్స్‌, జువెల్లరీ బిజినెస్‌ చేస్తారు. నేను గీతం కాలేజీలో ఎంబీఏ చేసాను. యూనివర్శిటీ ఆఫ్‌ మాంచెస్టర్‌ యు.కెలో ఎం.ఎస్సీ ఫ్యాషన్‌ రీటేలింగ్‌ చేసాను. అక్కడే బిజినెస్‌ ట్రిక్స్‌ నేర్చుకున్నాను. చిన్నప్పటి నుండి సెలవుల్లో మా కుటుంబమంతా కలిసి కాంచీపురం, వారణాసి ఇలా ఇండియాలోని వస్త్ర తయారీ కేంద్రాలకు వెళ్లేవాళ్ళం. అమ్మనాన్నకు భక్తి ఎక్కువ. వారి దైవదర్శనాలు అయ్యాక చీరలు కొనుక్కునే వాళ్ళం. అలా వస్త్రాలపై అభిరుచి పెరిగింది. ఏదైనా కొత్తగా చేయడమంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడే డ్యామేజ్‌ చీరలతో గౌన్లు, పరికిణిలు కుట్టేదాన్ని. అలా ప్యాషన్‌ డిజైనింగ్‌ పట్ల ఆకర్షితురాలినై ఈ సంస్థ స్థాపించాను.
వ్యాపార ప్రస్థానం
చేనేత అంటే మక్కువ ఎక్కువ. మా సంస్థలో చేనేత వస్త్రాలతో కొత్తగా డ్రెస్‌లు డిజైన్‌ చేస్తున్నా. మేము వాడే ఫ్యాబ్రిక్‌ మజ్లిన్‌(మల్‌ మల్‌). ఇది చాలా మృదువుగా ఉండి కుట్టేటప్పుడు పీక్కపోయే అవకాశం ఉంటుంది. అయినా చాలా జాగ్రత్తగా వివిధ రకాల దుస్తులు (ప్యాంట్‌ షర్ట్స్‌, వెస్ట్రన్‌ వేర్‌)తయారు చేస్తున్నాం. విదేశీయులకు మన చేనేత ప్రాముఖ్యాన్ని తెలియజేయడమే మా లక్ష్యం. అందుకని అనేక పుస్తకాలు చదివాను. చేనేత వస్త్ర తయారీ పరిశ్రమలను సందర్శించాను. చేనేత కార్మికులతో మాట్లాడాను. అనేక ప్రదేశాల్లో చేనేతపై అవగాహన కార్యక్రమాలు, వర్క్‌ షాపులు నిర్వహించాను. చీరలయితే మన దేశం వాళ్లే కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి విదేశీయులు కూడా ధరించేవిధంగా అన్నిరకాల వస్త్రాలు కుట్టాలనుకున్నాను. విదేశీయులకు చేనేత గురించి అంతగా తెలియదు. వారికి చేనేత గూర్చి తెలియ పరచడానికి చాలా కష్టపడ్డాను. ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి ఆ కష్టం కష్టంగా అనిపించడం లేదు. ఇప్పుడు మా వస్త్రాలు అనేక దేశాలలోకి ఎగుమతి అవుతున్నాయి. పర్యావరణ హితంగా కాటన్‌, సిల్క్‌ ఫ్యాబ్రిక్‌ వాడుతాం. ప్లాస్టిక్‌, పాలిస్టర్‌ వంటి కాలుష్య కారకాలు వాడాము. బటన్స్‌ కూడా వుడ్‌తో డిజైన్‌ చేస్తాం. ప్యాకింగ్‌కు బయోడిగ్రేడబుల్‌ కవర్స్‌ మాత్రమే వాడుతాం. పొల్యూషన్‌ లేని ఫ్యాషన్‌కు ప్రాముఖ్యం ఇస్తున్నాం. వీవర్స్‌కు పేమెంట్‌ ముందుగానే ఇస్తూ, వర్కర్స్‌ను ఫ్యామిలీ మెంబర్స్‌గా ట్రీట్‌ చేస్తూ ముందుకుసాగుతున్నాం.
సంస్థ ముఖ్య ఉద్దేశ్యం
మన సంప్రదాయమైన చేనేతను అందరికీ పరిచయం చేయడం, అలాగే అంతరించిపోతున్న చేనేత పరిశ్రమలను బలోపేతం చేయడం. చేనేత బట్ట ప్రాముఖ్యతను విదేశాల్లో ప్రచారం చేస్తూ చేనేత వస్త్ర ప్రేమికులను పెంచడం. మన దేశ గౌరవాన్ని పెంచడం మా ముఖ్య ఉద్దేశం. స్వాతంత్య్ర పోరాటంలో కూడా మన ఖాదీకి ప్రముఖ స్థానం ఉంది. ప్రస్తుతం బెంగాల్‌ జందానీ ఖాదీతో, కళంకారి మచిలీపట్నంతో వర్క్‌ చేస్తున్నాం. మా ఉత్పత్తులను ఫ్రాన్స్‌కు ఎగుమతి చేస్తున్నాం. ఇంకా మా వ్యాపారాన్ని అమెరికా, యూరప్‌, జపాన్‌ దేశాలకు విస్తరింపజేయాలి.
కుటుంబమే నా బలం
మా తాతయ్య, మా నాన్నే నాకు ఇన్స్పిరేషన్‌. కష్టపడి పనిచేయడం, క్రియేటివిటీ వాళ్లదగ్గరే నేర్చుకున్నాను. నా బలం నా కుటుంబమే. మా సంస్థపేరు కూడా మా కుటుంబ సభ్యుల పేర్లలోని అక్షరాలన్నీ కలిసే విధంగా ”లేబుల్‌ రామా” అని పెట్టాను. ఫ్రాన్స్‌లో మార్కెటింగ్‌కు ‘వి హబ్‌’ వారి సహాయం తీసుకుంటున్నాను. నేను నేటి తరాన్ని కోరేది ఒకటే చేనేత వస్త్రాలనే వాడండి. చేనేత పరిశ్రమల అభివృద్ధికి తోడ్పడం. చేనేత ఒక ఆర్ట్‌గా భావించి ఇష్టంగా కొనండి, అంతేగానీ సింపథీతో కాదు. మన వారసత్వాన్ని మనం కాపాడుకోవాలి. ఎక్కువ బట్టలు కొని వృధా చేయకుండా కొన్న వాటినే తృప్తిగా, తనివితీరా ధరించండి.

– అయిత అనిత, 8985348424