కార్డియాక్‌ రిహాబ్‌తో కోలుకున్న గుండె రోగులు

Heart patients recovering from cardiac rehab– ఇండిపెండెన్స్‌ డే రన్‌లో పరుగులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
గతంలో గుండె సంబంధిత జబ్బులు వచ్చాయంటే ఒక మూలన పడి ఉండమనేవారు. గతంలోనే కాదు… ఇప్పటికీ అవగాహనా రాహిత్యంతో అదే పని చేస్తున్నారు. కానీ, కొంత మంది గుండె సంబంధిత బాధితులు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారు సైతం ఇతరుల మాదిరిగా పరుగులు పెడుతుండటం గమనార్హం. ఇదెలా సాధ్యమైంది? కార్డియాక్‌ రిహాబ్‌ వారి జీవితాల్లో కొత్త వెలుగు తెస్తున్నది. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో కన్సల్టెంట్‌ కార్డియాక్‌ రిహాబ్‌ ఫిజిషియన్‌ డాక్టర్‌ మురళీధర్‌ బాబీ ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్‌ డే రన్‌ నిర్వహించారు.
వినూత్నమైన, ఆధునాతనమైన కార్డియాక్‌ రిహాబ్‌ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పెరిగిన తమ గుండె సామర్థ్యాన్ని ప్రదర్శించేలా పరుగులు తీశారు. దీంతో ప్రజల్లో కార్డియాక్‌ రిహాబ్‌ పనితీరు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించారు. ఐదు, 10 కిలోమీటర్ల పరుగులో పాల్గొని చూసే వారి కనులకు ఆశ్చర్యం కలిగించారు.
కోలుకోవడమే కాదు…మళ్లీ సాధారణ జీవితం
కార్డియాక్‌ రిహాబ్‌తో కేవలం కోలుకోవడమే కాకుండా గుండె రోగానికి గురి కాకముందు ఉన్నట్టు సాధారణ జీవితం గడుపగలుగుతున్నారని డాక్టర్‌ మురళీధర్‌ బాబీ తెలిపారు. ఇది జీవితాలను మారుస్తున్న విప్లవాత్మక కార్యక్రమమని తెలిపారు. గుండె బలం పెరగడంతో క్రీడలు, మారథాన్‌లో పాల్గొంటున్నారు. మధుమేహం, హైపర్‌ టెన్షన్‌, బీపీ తదితర రోగాలను నివారిస్తుందన్నారు. గుండె సమస్యలకు కారణమవుతున్న జన్యులోపాలు సరికావడం, ఆందోళన, డిప్రెషన్‌ నివారించబడంతో పాటు గుండె పోటుకు గురి కాకుండా కాపాడుతున్నదని తెలిపారు
– డాక్టర్‌ మురళీధర్‌ బాబీ