– జంట జలాశయాల్లోకి భారీగా వరద నీరు
– పొంగుతున్న వాగులు, వంకలు
– పలుచోట్ల కూలిన ఇండ్లు
– వికారాబాద్ జిల్లాలో పత్తిచేనులోకి నీరు
– ధారూర్ మండలంలో వరదలో చిక్కుకున్న ట్రాక్టర్ డ్రైవర్
– కడ్తాల్ మండలంలో ఆవు, దూడ మృత్యువాత
– క్షేత్రస్థాయిలో పర్యటించిన నాయకులు, అధికారులు
– నష్టాలపై ఆరా, పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు
-లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జోరు వాన కురిసింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు పొంగుతున్నాయి. జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లోకి భారీగా వరద నీరు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావడంతో జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. శుక్రవారం అధికారులు రెండు గేట్లను ఎత్తారు. ఇదిలా ఉంటే శిథిలావస్థకు చేరిన ఇండ్లు కొన్నిచోట్ల కూలిపోయాయి. ఆమనగల్‌లో ఆవు, దూడ మృత్యువాత పడ్డాయి. వికారాబాద్ జిల్లా ధరూర్‌లో మైలారం మొండికుంట చెరువు అలుగు పారడంతో అంపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్ వరదలో చిక్కుకున్నాడు. గ్రామస్తులు అప్రమత్తమై అతన్ని కాపాడారు. కోట్‌పల్లి, దోమ మండలాల్లో పత్తి పంట నీట మునిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు, నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. వర్షం వలన కలిగిన నష్టాలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక చర్యలు చేపట్టారు. వ్యవసాయ అధికారులు పంట పొలాలను పరిశీలించి రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.