వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు!

rain .img

– పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే మూడ్రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయనీ, ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు వానలు పడే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికను జారీ చేసింది. ఆ జాబితాలో ఆదిలాబాద్‌, కొమ్రంభీం అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, కరీంనగర్‌, కామారెడ్డి, నిజామాబాద్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, ములుగు, జిల్లాలున్నాయి. మంగళవారం రాత్రి 12 గంటల వరకు రాష్ట్రంలో 453 ప్రాంతాల్లో వర్షం పడింది. 18 ప్రాంతాల్లో భారీ, 200 ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. హన్మకొండ జిల్లా దామెరలో అత్యధికంగా 11.2 సెంటీమీటర్ల వాన పడింది. పెద్దపల్లి, హన్మకొండ, మంచిర్యాల్‌, భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌, ఖమ్మం, నిర్మల్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, సూర్యాపేట, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షం కురిసినట్టు తెలంగాణ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ ప్లానింగ్‌ సొసైటీ తెలిపింది.