వచ్చే రెండ్రోజులు భారీ వర్షాలు

 – పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. ఈ మేరకు వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో ఆరెంజ్‌ హెచ్చరికలను జారీ చేసింది. ఆ జాబితాలో ఖమ్మం నల్లగొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, కొమ్రంభీమ్‌ అసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ జిల్లాలున్నాయి. బుధవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్రంలో 120కిపైగా ప్రాంతాల్లో వర్షం కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా గంగారంలో 5.75 సెంటీమీటర్ల వర్షం పడింది.