హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు

Heavy rains in Himachal Pradesh– విరిగిపడుతున్న కొండచరియలు
– జాతీయ రహదారి 5 మూసివేత
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. ఎడతెరపి లేని వర్షాల కారణంగా పలుచోట్ల కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఆదివారం రహదారులపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మండి జిల్లాలో వర్షాల ప్రభావం మరిం త తీవ్రంగా ఉంది. వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక నివాసాలు నీట మునిగాయి. బిలాస్‌పూర్‌ జిల్లాలోనూ పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాకేష్‌లో కొండలపై నుంచి మట్టి, రాళ్లు దొర్లిపడి జాతీయ రహదారి 205పై రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని బిలాస్‌పూర్‌ జిల్లా యంత్రాంగం తెలిపింది. మరోవైపు మండి నుంచి సిమ్లాకు వెళుతున్న హిమాచల్‌ప్రదేశ్‌ ఆర్‌టిసి బస్సు లోయలో పడి 12 మంది గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సోలన్‌ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సిమ్లా-కల్కా మార్గంలో జాతీయ రహదారి 5ను పూర్తిగా మూసివేశారు. మరమ్మతుల అనంతరం ఈ మార్గంలో రాకపోకలను పునరుద్ధరించగా, మరోసారి కొండ చరియలు విరిగిపడటంతో మళ్లీ మూసేయాల్సి వచ్చింది. ఆ రాష్ట్రంలో ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో భారత వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.
14 వరకూ వర్షాలు..
హిమాచల్‌ప్రదేశ్‌తో పాటు పంజాబ్‌, హర్యానా, ఛండీగఢ్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, సబ్‌-హిమాలయన్‌ పశ్చిమబెంగాల్‌, సిక్కింలలో ఈ నెల 14వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ (ఐఎండి) ఆదివారం తెలిపింది. తూర్పు ఉత్తరప్రదేశ్‌ మీదుగా వాయువ్య భారతదేశంలో, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే సూచన ఉందని, 14న హిమాచల్‌ప్రదేశ్‌లో, ఉత్తరాఖండ్‌లో 17 వరకు, పంజాబ్‌, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో వివిధ చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 14న ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఉప-హిమాలయ పశ్చిమబెంగాల్‌, సిక్కింలలో 15 వరకు, గంగా పశ్చిమబెంగాల్‌ మీదుగా 16, 17 తేదీల్లో, ఒడిశా, ఝార్ఖండ్‌లో 15 నుంచి 17 వరకు, అండమాన్‌-నికోబార్‌ దీవుల మీదుగా 14 నుంచి 16 వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.