ఇన్ని ఆస్తులు ఎలా కూడబెట్టారు?

– కొండా మురళి ఓ మోసగాడు….:
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఏం పనులు చేసి అన్ని ఆస్తులు కూడబెట్టారో చెప్పాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొండా మురళి తాను చేయని పనులకు బిల్లులు క్లెయిమ్‌ చేసిన మోసగాడంటూ విమర్శించారు. వరంగల్‌ అభివద్ధిలో కొండా పాత్ర ఏముందని ప్రశ్నించారు. కొండా సురేఖ, ఆమె కూతురు సంస్కారం లేని భాష మాట్లాడుతున్నారని తెలిపారు. తాను గుండా, హంతకుడినంటూ ఒప్పుకున్న మురళికి నిజంగా దమ్ముంటే పరకాలలో పోటీ చేసి గెలవాలని సవాల్‌ చేశారు. కొండా భాష మార్చుకోవాలనీ, లేకపోతే తాను నోరు తెరవాల్సి వస్తుందని హెచ్చరించారు.