రేపు రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. మన ఓటు హక్కును ఉపయోగించుకోవల్సిన సమయం వచ్చేసింది. అయితే మనల్ని పాలించే పాలకులను ఎన్నుకునే అవకాశం అంటే ఓటు వేసే హక్కు మనకు అంత తేలిగ్గా రాలేదు. ప్రపంచ దేశాల మహిళలు ఎన్నో పోరాటాలు చేస్తే ఈరోజు మనం ఓటు వేస్తున్నాం. కాబట్టి పోరాడి సాధించుకున్న ఓటును మనం ఎలాంటి వారికి వేస్తున్నామో ఆలోచించాలి. మన కోసం నిస్వార్థంగా పని చేసే పాలకులను ఎన్నుకోవాలి. ఇంతకీ మహిళలకు ఓటు హక్కు ఎలా వచ్చిందో అప్పట్లో వారు చేసిన పోరాటాలు ఏ రూపంలో ఉన్నాయో తెలుసుకుందాం…
మాక్కూడా ఓటు హక్కు కావాలని బ్రిటన్‌లో మహిళలు మొట్టమొదటిసారి డిమాండ్ చేశారు. కానీ పాలకుల నుండి అది సాధ్యం కాదనే సమాధానం వచ్చింది. దీంతో ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలు ప్రభుత్వ నియమాలను, ప్రజల అభిప్రాయాన్ని మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఒక ఆటను, పోస్టు కార్డులను ఉపయోగించుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. 19వ శతాబ్దపు చివరి భాగంలో వారు సాగించిన ఆ ప్రచారం సృజనాత్మకతకు మారుపేరుగా నిలిచింది. ‘సాధ్యం కాదు’ అనే సమాధానాన్ని మహిళలు ఒప్పుకోలేదు. అందుకే సృజనాత్మక ప్రచారాన్ని తమ ఆయుధంగా మలచుకున్నారు. ‘సఫ్రేజెట్టో’ అనే ఒక ఆటను, పోస్టు కార్డుల సాయంతో ఓటు హక్కు కోసం పోరాడిన మహిళలు ప్రభుత్వ నియమాలను, ప్రజాభిప్రాయాన్ని శాశ్వతంగా మార్చేశారు.
‘సఫ్రేజెట్టో’ ఏమిటి?
చూడడానికి అవి చాలా సాధారణంగా, ఎలాంటి ప్రాముఖ్యతా లేని ఆట వస్తువులుగా కనిపిస్తాయి. కానీ సరైన చేతుల్లో పడితే, వాటికి సమాజాన్ని మార్చేసే శక్తి ఉందని ఓటు హక్కు కోసం పోరాడిన ఆనాటి మహిళలు నిరూపించారు. బ్రిటన్‌లో ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలు తమ భావాలను, అభిప్రాయాలను వ్యాప్తి చేయడానికి ఆటలే మంచి సాధనాలని గ్రహించారు. ఒక ఆట ద్వారా తమ ఆలోచనలను రాజకీయ వర్గాలూ, తద్వారా చట్టసభల వరకు తీసుకెళ్లవచ్చని వారు భావించారు.
ఆటతో మొదలై…
”నిజానికి అది ఒక మంచి మార్కెటింగ్ టూల్” అని ప్రొఫెసర్ సెనియా పసేటా అన్నారు. 2018 నాటికి బ్రిటన్‌లో మహిళలకు ఓటు హక్కు కల్పించి వందేండ్లు పూర్తయిన సందర్భంగా ఆక్స్‌ఫర్డ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌కు ఆమె క్యూరేటర్‌గా వ్యవహరించారు. దగ్గర నుంచి చూస్తే, ‘సఫ్రేజెట్టో’ గేమ్ ఇతర బోర్డులకు భిన్నంగా ఉంటుంది. దీనిలో 16 చిన్న ఆకుపచ్చ పావులు, 5 పెద్ద పావులు ఉంటాయి. ఓటు హక్కు కోసం పోరాడుతున్న మహిళలను, వాళ్ల నాయకురాళ్లను సూచిస్తాయి. పోలీసులు అడ్డుకునే లోపు ‘హౌస్ ఆఫ్ కామన్స్’ చేరుకుంటే ఆటలో గెల్చినట్లు. నిజజీవితంలో మాదిరే, ఈ ఆట మధ్యలో పట్టుబడితే జైలుకో, ఆస్పత్రికో వెళ్ళాల్సిందే.
ఓటు హక్కు ప్రచారం కోసం…
”ఈ ఆటను బ్రిటిష్ మహిళల సామాజిక, రాజకీయ సంస్థ (డబ్యూఎస్‌పీయూ) సభ్యురాళ్లు సృష్టించారు. మహిళలకు ఓటు హక్కు ప్రచారం కోసం నిధులు సేకరించడానికి ఆ ఆటను ఉపయోగించుకున్నారు. ఆ మహిళల వ్యూహం, నాటి సామాజిక పరిస్థితిని వాళ్లెంత బాగా అర్థం చేసుకున్నారు? వాళ్లకు ఎంత సెన్సాఫ్ హ్యూమర్ ఉంది?… ఇలాంటి విషయాలను ఆ ఆట తెలియపరుస్తుంది” అని ప్రొఫెసర్ పసేటా అంటారు. మాస్ కమ్యూనికేషన్‌లో ఇప్పటి ట్వీటర్‌కన్నా ముందున్న మహిళలు ఓటుహక్కు సాధించాలన్న లక్ష్యంతో అతి తక్కువ నిధులతో తమ పోరాటాన్ని ప్రారంభించారు.
నెట్‌వర్కింగ్, సాధికారత
ఆ రోజుల్లో మీడియాపై నియంత్రణల వల్ల కొన్నిసార్లు ఉద్యమంలో కొన్ని ముఖ్యమైన వార్తలను చేరవేయడానికి, మద్దతు కూడగట్టడానికి, నిధుల సేకరణకు పోస్టుకార్డుల ఉద్యమం బాగా ఉపయోగపడింది. ఈ ఉద్యమం ప్రధానంగా మహిళా వాలంటీర్లపై ఆధారపడింది. తద్వారా వారి సాధికారత పెరిగి, మహిళలు తమ శక్తియుక్తులను గ్రహించడం ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా మొదటిసారి మహిళలను వారి నైపుణ్యాలు, వారు చేపట్టే పనుల ఆధారంగా వర్గీకరించారు. వారిని వివిధ కార్యకలాపాల కోసం ఉపయోగించుకోవడం ప్రారంభమైంది. ఈ ఉద్యమంలో పాల్గొన్న నటీమణులు తమ గొంతును ఎలా ఉపయోగించుకోవాలో ఉద్యమకారులకు శిక్షణను ఇచ్చేవారు. కళాకారులు పోస్టర్లు, బ్యానర్లు తయారు చేసి ఇచ్చేవాళ్లు. రచయితలు ప్రసంగాలు తయారు చేసి ఇస్తే, టీచర్లు సాయంత్రం క్లాసులు తీసుకునేవాళ్లు.మంచి అవగాహన ఉండేది
ప్రపంచానికి తమ గొంతు వినిపించారు
యూకేలో మహిళల ఓటు హక్కు కోసం పోరాటం తీవ్రంగా సాగుతుండగానే వాళ్లు ప్రపంచంలోని ఇతర చోట్ల కూడా మహిళల జీవితాలు, రాజకీయ కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించారు. అప్పటికే న్యూజీల్యాండ్, నార్వేలలో మహిళలకు ఓటు హక్కు లభించింది. కానీ మిగతా చోట్ల మాత్రం వారికి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. యూకేలో మహిళల ఓటు హక్కు కోసం జరిగిన పోరాటం, దేశ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మహిళలను ఆ దిశగా కార్యోన్ముఖులను చేసింది. ఆనాటి పోరాట యోధులకు ప్రపంచవ్యాప్తంగా మహిళల పరిస్థితుల గురించి చాలా అవగాహన ఉండేది. దీనికి నాటి వుమెన్స్ సఫ్రేజెట్ జర్నల్, ఓట్స్ ఫర్ వుమెన్ ప్రచురణలు సాక్ష్యం.
ఓటు హక్కును విస్తరించేందుకు
ఫ్రాంచైజీని పొడిగించడంపై చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని కమిషన్ సిఫార్సు చేసింది. మహిళల అభిప్రాయాలు సేకరించి మూడు రౌండ్ టేబుల్స్ నుండి నివేదికలను బ్రిటిష్ పార్లమెంట్ జాయింట్ కమిటీకి పంపించారు. ఓటింగ్ వయసును 21 ఏండ్లకు తగ్గించాలని సిఫార్సు చేశారు. అయితే ఆస్తి, అక్షరాస్యత, అలాగే వారి వైవాహిక స్థితిపై మహిళల ఓటు హక్కు ఆధారపడి వుంటుంది. ఈ నిబంధనలు భారత ప్రభుత్వ చట్టం 1935లో పొందుపరచబడ్డాయి. ఇది ఎన్నికల అర్హతను పొడిగించింది. అయితే భారతదేశంలో 2.5శాతం మంది మహిళలకు మాత్రమే ఓటు వేయడానికి అనుమతిపొందారు. దాంతో తర్వాత కాలంలో అందరికీ ఓటు హక్కు కావాలని ఎన్నో పోరాటాలు జరిగాయి. 1946లో భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికైనప్పుడు 15 సీట్లు మహిళలకే దక్కాయి. వారంతా కొత్త రాజ్యాంగాన్ని రూపొందించడంలో సహాయపడ్డారు. ఏప్రిల్ 1947లో అసెంబ్లీ సార్వత్రిక ఓటు హక్కును అంగీకరించింది.
మొదటిసారి ఇద్దరు మహిళలు
1919 – 1929 మధ్య అన్ని బ్రిటీష్ ప్రావిన్స్‌లు, అలాగే చాలా ప్రిన్స్లీ స్టేట్‌లు మహిళలకు ఓటు హక్కును మంజూరు చేశాయి. కొన్ని సందర్భాల్లో స్థానిక ఎన్నికలలో నిలబడటానికి అనుమతించాయి. 1919 లో మద్రాసు నగరంలో, 1920లో ట్రావెన్‌కోర్ రాజ్యం, ఝలావర్ రాష్ట్రం, బ్రిటీష్ ప్రావిన్స్‌లలో, మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ 1921లో విజయం సాధించాయి. రాజ్‌కోట్ రాష్ట్రం 1923లో పూర్తి సార్వత్రిక ఓటుహక్కును మంజూరు చేసింది. ఆ ఏడాది భారతదేశంలో లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు మొదటి సారి ఇద్దరు మహిళలు ఎన్నికయ్యారు. 1924లో ముద్దిమాన్ కమిటీ తదుపరి అధ్యయనాన్ని నిర్వహించి బ్రిటీష్ పార్లమెంట్ మహిళలను ఎన్నికలలో నిలబడటానికి అనుమతిం చాలని సిఫార్సు చేసింది. ఇది 1926లో ఓటింగ్ హక్కులపై సంస్కరణను రూపొందించింది. 1927లో కొత్త భారతదేశ చట్టాన్ని రూపొందించ డానికి సైమన్ కమిషన్‌ను నియమించారు. కమిషన్‌లో భారతీ యులు లేనందున, జాతీయవాదులు వారి సమావేశాలను బహిష్కరించారు. ఇది మహిళా సమూహాలలో చీలికలను సృష్టించింది. వారు ఒక వైపు సార్వత్రిక ఓటు హక్కుకు అను కూలంగా, మరోవైపు విద్యా, ఆర్థిక ప్రమాణాల ఆధారంగా పరిమిత ఓటు హక్కును కొనసాగించడానికి అనుకూలంగా ఉన్నారు.
భారతదేశంలో ఓటు హక్కు
మన దేశంలో మహిళల ఓటు హక్కు ఉద్యమం బ్రిటీష్ పాలనలో కలోనియల్ ఇండియాలో రాజకీయ హక్కు కోసం పోరాడింది. 1918లో బ్రిటన్ ఆస్తిపరులకు పరిమిత ఓటుహక్కును మంజూరు చేసినప్పుడు, సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలలోని బ్రిటిష్ పౌరులకు చట్టం వర్తించదు. భారతీయ ఓటింగ్ నిబంధనలను అధ్యయనం చేయడానికి పంపిన బ్రిటిష్ కమిషన్‌లకు మహిళలు, పురుషులు సమర్పించిన పిటిషన్‌లు ఉన్నాయి. అయితే మోంటాగు-చెమ్స్‌ఫోర్డ్ సంస్కరణల్లో మహిళల డిమాండ్‌లు విస్మరించబడ్డాయి. 1919లో సౌత్‌బరో ఫ్రాంచైజీ ఎన్నికల నియంత్రణ సంస్కరణలను ఖరారు చేయడానికి సమావేశమైన హౌస్ ఆఫ్ లార్డ్స్ అండ్ కామన్స్ జాయింట్ సెలెక్ట్ కమిటీ ముందు, హౌస్ ఆఫ్ లార్డ్స్, కామన్స్ ముందు ఓటు హక్కుదారులు మహిళలకు ఓటు వేయడానికి మద్దతుగా నివేదికలను సమర్పించారు. వారికి ఓటింగ్ హక్కులు లేదా ఎన్నికలలో నిలబడే హక్కు ఇవ్వనప్పటికీ భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం ఆస్తి, ఆదాయం లేదా విద్యా స్థాయిలను బట్టి మహిళలు ఓటు వేయడానికి ప్రావిన్షియల్ కౌన్సిల్‌లను అనుమతించింది.