ఎవరికి ఎన్ని ఓట్లు..?

ఎవరికి ఎన్ని ఓట్లు..?– పోలింగ్‌ సరళిపై అభ్యర్థులు,జనాల్లో చర్చలు
– ఉమ్మడి ఆదిలాబాద్‌లో చాలాచోట్ల టఫ్‌ ఫైట్‌
– విజయావకాశాలపై అభ్యర్థుల లెక్కలు
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్నికల సమరంలో ఫలితాలు వెలువడటమే మిగిలింది. పోలింగ్‌ ముగిసిన నాటి నుంచి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏ పార్టీ విజయం సాధిస్తుంది.. ఏ అభ్యర్థికి ఎంత మెజార్టీ వస్తుంది.. ఏయే గ్రామాల్లో తమ పార్టీలకు అధికంగా ఓట్లుపడ్డాయి.. వేటిలో తక్కువగా ఉండే అవకాశం ఉంది తదితర అంశాలపై ఇప్పటికే విశ్లేషణలు సాగుతున్నాయి. మరోపక్క ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలపైనా తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇందులో ఏది సరైనదో.. ఏది కాదో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ముఖ్యంగా వివిధ పార్టీల మధ్య రాష్ట్రంలో చాలాచోట్ల టఫ్‌ఫైట్‌ నడిచిందని వార్తలు రావడంతో ఇందులో విజేతలెవరో.. పరాజితులెవరో తెలియని పరిస్థితి ఉంది. ఫలితాలు వచ్చే వరకు అభ్యర్థులు, పార్టీల ముఖ్య నాయకుల్లోనూ ఆందోళన కనిపిస్తోంది.
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా వీటి పరిధిలో 148మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి పదిహేను మంది వరకు పోటీ పడ్డారు. పోలింగ్‌ సరళితో పాటు స్థానికుల నుంచి వినిపించిన మాటల ప్రకారం మూడు ప్రధాన పార్టీల మధ్యనే హోరాహోరీ పోరు సాగిందని తెలుస్తోంది. ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా.. ఇక్కడ కాంగ్రెస్‌ సైతం గట్టిపోటీ ఇస్తుందని చెబుతున్నారు. బోథ్‌లోనూ బీఆర్‌ఎస్‌, బీజేపీకి మధ్య పోటీ ఉంటుందని.. కాంగ్రెస్‌ ప్రభావం కూడా బాగానే ఉంటుందని తెలుస్తోంది. ఖానాపూర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య వార్‌ ఉంటుందని, నిర్మల్‌లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని సమాచారం. ముధోల్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ తీవ్ర పోటీ ఉంటుందని.. ఇక్కడ కాంగ్రెస్‌ సైతం గణనీయమైన సంఖ్యలో ఓట్లు సాధిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఆసి ఫాబాద్‌లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని, ఇక్కడ బీజేపీ బాగానే ఓట్లు సాధిస్తుందని తెలుస్తోంది. సిర్పూర్‌లో బీఆర్‌ఎస్‌, బీజేపీ, బీఎస్‌పీ మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని.. ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభావం బాగానే ఉంటుందని చెబుతున్నారు. మంచిర్యాల, చెన్నూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్యనే తీవ్ర పోటీ ఉంటుందన్నారు.
బోథ్‌లో అత్యధికం.. మంచిర్యాలలో అత్యల్పం..!
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఓటింగ్‌ ప్రక్రియ ముగియడంతో ఆయా చోట్ల పోలింగ్‌ శాతాన్ని అధికారులు లెక్కించారు. గతేడాది కంటే పోలింగ్‌ స్వల్పంగా తగ్గింది. ఖానాపూర్‌లో తప్ప మిగతా ఏ నియోజకవర్గంలో చూసినా పోలింగ్‌ తగ్గింది. బోథ్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 82.93పోలింగ్‌ శాతం నమోదు కాగా.. అన్నింటి కంటే తక్కువగా మంచిర్యాలలో 69.06శాతం నమోదు కావడం గమనార్హం. ఈ ఏడాది ఏకంగా పది నియోజకవర్గాల్లోనూ పోలింగ్‌ శాతం తగ్గిపోవడం గమనార్హం. పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు అధికార యంత్రాంగం విస్తృత ప్రచారం కల్పించింది. కానీ బయటి ప్రాంతాల్లో ఉండేవారిలో చాలా మంది ఓటేసేందుకు సొంత ఊరికి, ప్రాంతానికి రాలేకపోయారని తెలుస్తోంది. దీంతో పోలింగ్‌ శాతం తగ్గినట్టు చెబుతున్నారు.