బాదం ఎలా తినాలి..!?

పిల్లల నుంచి పెద్దల వరకు తినగలిగే ఆహారంలో బాదం పప్పు కూడా ఒకటి. బాదం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో న్యూట్రీషియన్స్‌, విటమిన్స్‌, ఫైబర్‌, మెగ్నీషియం, ఓమేగా3 ఫ్యాటీయాసిడ్స్‌, ప్రోటీన్స్‌ అత్యధికంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజు తినడం వల్ల ఇన్సులిన్‌ స్థాయి అదుపులో ఉంటుంది. శరీరం గ్లూకోజ్‌ను శోషించుకు నేందుకు ఇవి దోహదం చేస్తాయి. తద్వారా మధుమేహం అదుపులో ఉంటుంది. నానబెట్టిన బాదం తినొచ్చా లేదా అన్నది చాలా మందిలో ఉండే సందేహం. అయితే నానబెట్టిన బాదం తినడమే ఆరోగ్యానికి మంచిది.
ఎందుకంటే… బాదం మీద ఉండే తొక్కలో టానిన్‌ అనే పదార్థం ఉంటుంది. అది మన శరీరం పోషకాలను గ్రహించకుండా అడ్డుకుంటుంది. అందువల్ల బాదం పప్పును రాత్రి పూట నానబెట్టుకోవాలి. పొద్దున్నే తొక్క తీసేసి తినాలి. ఉదయం సమయంలో నానబెట్టిన బాదం తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.