ఓఆర్‌ఆర్‌ ప్రయివేటుకు ఎలా ఇస్తారు?

–  అసెంబ్లీలో కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత భట్టి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
‘హైదరాబాద్‌ అభివృద్ధి మీ వల్ల జరగలేదు. మా వల్లే జరిగింది. మేం వేసిన పునాదుల వల్లే ఇప్పుడు మీకు ఎకరం వందకోట్లు పలుకుతుంది. మేం కట్టిన ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)ను అతి తక్కువ ధరకు ప్రయివేటు కంపెనీకి ఎలా కట్టబెడ్తారు? రూ.2.7 లక్షల కోట్ల ఆస్తిని కేవలం రూ.7,385 కోట్లకు ఉదారంగా ఎలా ఇస్తారు? 30 ఏండ్లకు లీజుకిచ్చి, 30 ఏండ్ల సొమ్మును మూడు నెలల్లో చెల్లించాలని షరతు పెడితే, ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఏం చేయాలి? పట్టణ ప్రగతి అంటే బంజారాహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ వంటివే కాదు. హైదరాబాద్‌ గ్లోబల్‌ సిటీ మావల్లే అయ్యింది” అని శాసనసభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపూ అధికార పక్ష సభ్యులు, మంత్రులు అడ్డుపడుతూనే ఉండటంతో ఒకింత అసహనానికి గురయ్యారు. బీసీ జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని సూచించారు. పల్లె ప్రగతి పేరుతో శ్మశానాలు, చెరువులు, కుంటల్లో క్రీడా మైదానాల పేరుతో బోర్డులు పెట్టి చేతులు దులుపుకున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ట్రాక్టర్లకు ఈఎమ్‌ఐ, డ్రైవర్లకు జీతాలు ఇవ్వలేక పంచాయతీలు నానా అవస్థలు పడుతున్నాయని చెప్పారు.