భార్యను హతమార్చిన భర్త అరెస్ట్..

నవతెలంగాణ – అశ్వారావుపేట
భార్యను హతమార్చిన భర్త సంఘటన లో ముద్దాయిగా గుర్తించిన పాపారావు ను శనివారం సి.ఐ కరుణాకర్ అరెస్ట్ చేసి కోర్టుకు పంపారు. తన కార్యాలయం లో ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  దమ్మపేట మండలం రాచూరి పల్లి కి చెందిన మొడియం పాపారావు కు సుమారు 21 సంవత్సరముల క్రితం అశ్వారావుపేట మండలం పండు వారి గూడెం కాలనీకి చెందిన వెంకట లక్ష్మితో పెండ్లి కాగా అప్పటినుండి కూలి పనులు చేసుకుంటూ పండు వారిగూడెంలోనే వుంటున్నాడు. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు వారికి వివాహం చేసారు. ప్రస్తుతం భార్యతో వుంటున్నాడు. ఇతను గత 10 సంవత్సరముల నుండి చెడు వ్యసనాలకు అలవాటుపడి, భార్యను డబ్బులు అడిగితే ఆమె ఇవ్వకుండా అడ్డు చెప్తున్నదని ఆమెతో గొడవ పెట్టుకొని కొట్టేవాడు. ఈ క్రమంలో భార్య తరుపు వారు అనేక సార్లు పంచాయతీ పెట్టినా మారకుండా ఇతను మరలా భార్య డబ్బులు ఇవ్వటం లేదని ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించు కొంటే తన జల్సాలకు ఇక అడ్డం వుండదు అనుకోని  ఈ నెల 10 వ, తేదీ రాత్రి సుమారు 10 గంటల సమయములో మందు త్రాగటానికి భార్య వెంకటలక్ష్మి ని డబ్బులు అడగగా ఆమె తన దగ్గర డబ్బులు లేవు అని తిట్టగా ఇతనికి కోపం వచ్చి ఆ ఇంట్లో వున్న కర్ర తో భార్యను కొడుతుండగా ఆమె కేకలు వేయగా, ఆ కేకలు విని చుట్టుప్రక్కల ఇండ్ల వారు గుజ్జా వీర్రాజు, సోరేం గోపమ్మ, సోరేం దుర్గారావులు రాగా, ఇతను పోటకత్తిని తీసుకొని అడ్డం వస్తే మిమ్మల్ని కూడా చంపుతాను అని వారిని బెదిరించగా వారు వెళ్ళి పోయినారు. ఎలాగైనా భార్యను అడ్డు తొలగించాలని, కొడవలిని తీసుకొని ఆమె తల వెనుక భాగములో బలంగా కొట్టగా ఆమె క్రింద పడి రక్తపు కారు చుండగా ఆమెను ఎత్తుకొని తన ఇంట్లో వున్ననవ్వారు మంచంపై పడుకో బెట్టగా ఆమె గిలగిలా కొట్టుకొని చనిపోగా, ఆమె చనిపోయినదని పూర్తిగా నిర్ధారించుకున్న తరువాత ఇతను బయటకు వచ్చి ఆ గ్రామంలోనే వూరి చివర రేకుల షెడ్ వద్దకు వెళ్ళి అక్కడ కొడవలి, కర్ర, పొటకత్తి ని మరియు తన భార్యను చంపుతుండగా ఆమె రక్తం అంటిన తన చొక్కను ఒక ప్లాస్టిక్ బస్తాలో పెట్టి రేకుల షెడ్ లో పొగాకు బేరన్ లో దాచి ఎవరికి కనపడకుండా అక్కడే దాక్కొనగా శనివారం అరెస్టు చేసి, పంచనామా జరిపి జుడీషియల్ రిమాండ్ కు పంపనైనది అని తెలిపారు. అతని వద్ద స్వాధీన చేసుకొన్న వస్తువులు  కొడవలి, కర్ర, పోట కత్తి, రక్తం అంటి న ముద్దాయి దుస్తులు సేకరించి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విలేకర్లు సమావేశంలో ఎస్.హెచ్.ఓ పొడిశెట్టి శ్రీకాంత్,ఎస్.ఐ శివరాం లు పాల్గొన్నారు.